అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగే ముందు పైలట్ నుంచి MAYDAY కాల్.. అంటే ఏమిటి? ఆ తర్వాత ఏం చేశారు?
ఆ తర్వాత కొన్ని క్షణాలకే విమానాశ్రయ సమీపంలో ప్రమాదం సంభవించింది.

అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు MAYDAY కాల్ ఇచ్చింది. అయితే, ఆ తర్వాత విమానం నుంచి స్పందన కోసం ఏటీసీ చేసిన ప్రయత్నాలకు ఎలాంటి స్పందన రాలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. విమానం కూలిపోయే ముందుగా ఇచ్చిన ఆ MAYDAY కాల్ అంటే ఏమిటి?
MAYDAY కాల్ అంటే?
విమానయాన రంగంలో MAYDAY అనేది అత్యవసర సమయంలో ఉపయోగించే అంతర్జాతీయ పరిభాష పదం. ఇది విమానం ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు. విమానయాన టర్మినాలజీలో దీన్ని “అత్యవసర సంకేతం”గా పరిగణిస్తారు.
“MAYDAY” అనే పదం ఫ్రెంచ్ భాషలో “m’aider” (మైడర్) అనే పదం నుంచి పుట్టుకొచ్చింది. “నన్ను కాపాడండి” అని దీని అర్థం. ఈ సంకేతాన్ని సాధారణంగా రేడియో ద్వారా ఏటీసీకి లేదా సమీపంలోని ఇతర విమానాలకు పంపిస్తారు. ఆపదలో ఉన్న విమానం సాయం కోరే సమయంలో ఈ సంకేతం ఉపయోగిస్తారు. విమానానికి అత్యవసర పరిస్థితుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
MAYDAY కాల్ ఎప్పుడు ఇస్తారు?
విమాన ఇంజిన్ ఫెయిల్యూర్ అయినప్పుడు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు, విమానంలో లోపాలు తలెత్తినప్పుడు, విమానంలో వైద్య అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు… ఇలాంటి సందర్భాల్లోనే పైలట్ ఈ సంకేతాన్ని పంపిస్తారు.
MAYDAY కాల్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు?
ఈ కాల్‌ను అందుకున్న వెంటనే ఏటీసీ, సంబంధిత అధికార సంస్థలు సహాయక వేగంగా చర్యలు తీసుకుంటాయి. విమానాన్ని ప్రమాదం నుంచి రక్షించేందుకు అవసరమైన సాంకేతిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటాయి.
ఎయిరిండియా AI171 విమానం పైలట్ల నుంచి కూడా ఏటీసీకి మేడే కాల్ వచ్చినట్లు ఇప్పటికే పౌర విమానయానశాఖ వర్గాలు తెలిపాయి. అయితే, మేడే కాల్ వచ్చిన తర్వాత పైలట్లను సంప్రదించేందుకు ఏటీసీ ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదని చెప్పింది. ఆ తర్వాత కొన్ని క్షణాలకే విమానాశ్రయ సమీపంలో ప్రమాదం సంభవించింది.