Ahmedabad Plane Crash: ఒక్కొక్కరికి కోటి రూపాయలు.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ పరిహారం

గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా మేమే భరిస్తాం. బీజే మెడికల్‌ కాలేజ్‌ హాస్టల్‌ భవనాన్ని పునర్ నిర్మిస్తామం.

Ahmedabad Plane Crash: ఒక్కొక్కరికి కోటి రూపాయలు.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ పరిహారం

Updated On : June 12, 2025 / 8:41 PM IST

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం పెను విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో 200మందికిపైగా చనిపోయారు. అనేక కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది. అహ్మదాబాద్ విమాన దుర్ఘటనపై టాటా గ్రూప్ స్పందించింది. మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్‌ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామంది. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వైద్య ఖర్చులన్నీ భరిస్తామని టాటా గ్రూప్‌ స్పష్టం చేసింది. అంతేకాదు బీజే మెడికల్‌ కాలేజ్‌ హాస్టల్‌ భవనాన్ని పునర్ నిర్మిస్తామని వెల్లడించింది. ఈ మేరకు టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

Also Read: విమాన ప్రమాదంలో ఎవరైనా చనిపోతే పరిహారం ఎవరిస్తారు? విమాన కంపెనీలా? ఇన్సూరెన్స్ కంపెనీలా? ఎంత ఇస్తారు?

‘‘ఎయిర్ ఇండియా ప్రమాద ఘటన మమ్మల్ని ఎంతగానో కలచివేసింది. ఆ బాధను వ్యక్తపరచడానికి మాటలు రావడం లేదు. ప్రమాదంలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి టాటా గ్రూప్‌ తరపున కోటి రూపాయలు అందజేయనున్నాం. గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా మేమే భరిస్తాం. వారి సంరక్షణ బాధ్యత కూడా మాదే. బీజే మెడికల్‌ హాస్టల్ నిర్మాణానికి మా వంతుగా తోడ్పాటు అందిస్తాం’’ అని చంద్రశేఖరన్‌ ఎక్స్ వేదికగా తెలిపారు.

 

అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాలకే నేలకూలింది. 242 మంది ప్రయాణికులతో ఉన్న ఆ విమానం ఎయిర్ పోర్టు సమీపంలోని మేఘానీనగర్ లో ఉన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఏటీసీ ప్రకారం మధ్యాహ్నం 1.39 గంటలకు విమానం టేకాఫ్ అయ్యింది. వెంటనే ఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వెళ్లింది. ఆ వెంటనే ఏటీసీ సంప్రదించినా విమానం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎయిర్ పోర్ట్ బయట ఫ్లైట్ కుప్పకూలింది. గాల్లోకి ఎగిరిన కాసేపటికే అది నేలకూలింది. విమానం కూలగానే భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. గురువారం(జూన్ 12) మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది.