భారత వాయుసేనలోకి అపాచీ వచ్చేసింది

అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేసే అమెరికా యుద్ధ హెలికాప్టర్ అపాచీ ఇప్పుడు భారత వాయుసేన అమ్ములపొదిలో చేరింది.మొదటి ఏహెచ్-64E(I) హెలికాప్టర్ ను శుక్రవారం అమెరికా కంపెనీ ఇండియాకు అప్పగించినట్లు ఎయిర్ ఫోర్స్ శనివారం(మే-11,2019) ట్వీటర్ ద్వారా తెలిపింది.అపాచీని వాయుసేనకు అప్పగించే కార్యక్రమంలో అమెరికా ప్రభుత్వ ప్రతినిధులు కూడా పాల్గొన్నట్లు తెలిపింది.
ఈ హెలికాప్టర్ ను అపాచీ గార్డియన్ గా పిలుస్తారు. యుద్ధ హెలికాప్టర్లలో ఇది అడ్వాన్స్ డ్ వర్షెన్. 2015 సెప్టెంబర్‌లో 22 అపాచీ హెలికాఫ్టర్ల కోసం అమెరికా ప్రభుత్వం,బోయింగ్ తో కాంట్రాక్ట్ పై ఐఏఎఫ్ సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూలైలో మొదటి దశ హెలికాప్టర్లు భారత్ చేరుకోనున్నాయి. అపాచీ హెలికాప్టర్ల నిర్వహణ కోసం ఇప్పటికే మన వాయు దళం శిక్షణ తీసుకున్నది. అలబామాలోని ఫోర్ట్ రూకర్ ఆర్మీ బేస్‌లో ఆ శిక్షణ జరిగింది. ఎయిర్ క్రూతోపాటు గ్రౌండ్ క్రూ కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. బోయింగ్ సంస్థకు చెందిన ఈ హెలికాప్టర్ గగనతలంలో.. నేలపైన టార్గెట్లను చేధించగలదు. సైనిక దళాలకు అపాచీలు అండగా ఉంటాయని ఐఏఎఫ్ తన ఫేస్‌బుక్ పోస్టులో అభిప్రాయపడింది. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థనే తయారు చేసే మరో యుద్ధ రవాణా హెలికాప్టర్ చినూక్ ను కూడా భారత్ గతంలోనే తెచ్చుకున్నది