కోర్టు రూములోకి అర కిలో వెల్లుల్లి తీసుకొచ్చిన లాయర్.. న్యాయమూర్తి సీరియస్.. ఎందుకో తెలుసా..
ఈ కేసును విచారించిన కోర్టు, అటువంటి నిషేధిత వస్తువులు దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించే యంత్రాంగానికి సంబంధించిన సూచనలను కోరాలని..

Chinese Garlic (Photo Credit : Google)
Chinese Garlic : అలహాబాద్ హైకోర్టులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్న ఓ న్యాయవాది.. అర కేజీ చైనీస్ వెల్లుల్లితో పాటు మన దేశంలో ఉత్పత్తి చేసే సాధారణ వెల్లుల్లిని న్యాయస్థానానికి తీసుకొచ్చారు. వాటిని ఏకంగా కోర్టు రూమ్ లోకి తీసుకెళ్లారు. దీనిపై న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఇంతకీ ఆ లాయర్ వెల్లుల్లిని కోర్టు రూమ్ లోకి ఎందుకు తెచ్చారు? న్యాయమూర్తి ఎందుకు సీరియస్ అయ్యారు? అనే సందేహం కలిగింది కదూ. మ్యాటర్ ఏంటంటే.. మన దేశంలో చైనా వెల్లుల్లిపై నిషేధం ఉంది. 2014లో దాని దిగుమతి, వాడకంపై బ్యాన్ విధించారు. అయినప్పటికీ ఇంకా మన దేశ మార్కెట్ లో చైనా వెల్లుల్లి విరివిగా లభిస్తోంది. ఈ విషయాన్ని ఆధారాలతో నిరూపించాలనే ఆ న్యాయవాది ఇలా చేశారట.
భారత మార్కెట్‌లలో చైనా వెల్లుల్లి లభ్యత అంశాన్ని లేవనెత్తుతూ న్యాయవాది మోతీ లాల్ యాదవ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా జస్టిస్ రాజన్ రాయ్, జస్టిస్ ఓం ప్రకాశ్ శుక్లాలతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ అధికారికి సమన్లు జారీ చేసింది. చైనీస్ వెల్లుల్లి లభ్యతను సీరియస్ గా తీసుకున్న అలహాబాద్ హైకోర్టు.. యూపీ ప్రభుత్వ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ అధికారిని పిలిపించింది. అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హానికరమైన ప్రభావాల కారణంగా 2014లోనే చైనా వెల్లుల్లిపై నిషేధం విధించినా.. ఇంకా మన మార్కెట్ లోకి ఎలా వస్తోందని బెంచ్ ప్రశ్నించింది.
ఇవాళ ఈ కేసును విచారించిన కోర్టు, అటువంటి నిషేధిత వస్తువులు దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించే యంత్రాంగానికి సంబంధించిన సూచనలను కోరాలని భారత డిప్యూటీ సొలిసిటర్ జనరల్ సూర్యభాన్ పాండేని ఆదేశించింది. అటువంటి వస్తువుల ప్రవేశానికి మూలాన్ని గుర్తించడానికి, నిరోధించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలపాలని కోర్టు కోరింది. భారత మార్కెట్‌లో నిషేధిత చైనీస్ వెల్లుల్లి ఎగుమతి, అమ్మకాలపై విచారణ జరిపి దోషులుగా ఉన్న అధికారులు, ఇతర నేరస్థులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా సీబీఐని ఆదేశించాలని న్యాయవాది యాదవ్ తన పిటిషన్ లో కోరారు.
దేశంలోకి ఫంగస్ సోకిన వెల్లుల్లి వస్తుందని వచ్చిన నివేదికల కారణంగా 2014లో భారత ప్రభుత్వం చైనీస్ వెల్లుల్లి దిగుమతిని నిషేధించింది. అక్రమంగా తరలిస్తున్న వెల్లుల్లిలో పురుగు మందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో వెల్లుల్లిని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం చైనా.
చైనీస్ వెల్లుల్లి పురుగుమందులు, రసాయనాలను ఉపయోగించి ఉత్పత్తి చేయబడుతుందని యాదవ్ తన పిల్ లో పేర్కొన్నారు. అందువల్ల, ఇది భారతదేశ నాణ్యతా ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైందన్నారు. దేశంలో చైనా వెల్లుల్లి దిగుమతి, రవాణ, అమ్మకం నిషేధించబడినప్పటికీ, ఇంకా మన మార్కెట్‌లో అందుబాటులో ఉందని తెలిపారు. మన దేశంలో చైనీస్ వెల్లుల్లి దిగుమతి, విక్రయాలు జరక్కుండా చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అవుతోందనే విమర్శలు ఉన్నాయి.
చైనా వెల్లుల్లిపై మన దేశం 2014లోనే బ్యాన్ విధించింది. ఫంగస్ సోకిన వెల్లుల్లిని చైనా తరలిస్తుండటంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ ఇంకా పలు ప్రాంతాల్లో చైనీస్ వెల్లుల్లి విచ్చలవిడిగా లభ్యం అవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. అక్రమ మార్గాల్లో చైనా గార్లిక్ భారత్ లోకి చేరుతున్నట్లు అధికారులు గుర్తించారు. చైనా వెల్లుల్లి తినడం చాలా డేంజర్. మన ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది. ఎందుకంటే.. చైనా గార్లిక్ లో అధిక మోతాదులో పురుగుల మందులు వాడారు.
Also Read : కల్తీ నెయ్యిని ఇంట్లోనే సింపుల్‌గా ఎలా గుర్తించాలి?