హర్యాణాలో జార్ఖండ్ ఎఫెక్ట్…బీజేపీతో పొత్తు విషయమై సీనియర్ లీడర్ రాజీనామా

ఇప్పుడు జార్ఖండ్ ప్రజలు ఇచ్చిన షాక్ తో కోలుకోకముందే బీజేపీకి మరో షాక్ తగిలింది. జార్ఖండ్ లో అధికారాన్ని కోల్పోయిన ప్రభావం.. హర్యానా మీద పడినట్టు కనిపిస్తోంది. హర్యాణా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జేజేపీలో లుకలుకలు మొదలయ్యాయి. జేజేపీ ఎమ్మెల్యేలు తిరుగుబావుటాకి రెడీ అయ్యారు.జేజేపీ చీఫ్,హర్యాణా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా వైఖరికి నిరసనగా పార్టీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే రామ్ కుమార్ గౌతమ్ పదవి నుంచి తప్పుకొన్నారు. ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని బీజేపీ సాధించలేక పోయింది. అదే సమయంలో 10 స్థానాలను సాధించి కింగ్ మేకర్ గా అవతరించిన జేజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది బీజేపీ. ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించడం ద్వారా దుష్యంత్ చౌతాలా మద్దతును కూడగట్టింది. మనోహర్ లాల్ ఖట్టర్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగలిగారు. అలాంటి సంకీర్ణ కూటమి సర్కార్ లో తాజాగా ముసలం పుట్టుకొచ్చింది. దుష్యంత్ చౌతాలా వైఖరిని తప్పు పడుతూ జన్ నాయక్ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు రామ్ కుమార్ గౌతమ్ తప్పుకొన్నారు. తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన నర్నౌద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
బీజేపీకి మద్దతు ఇచ్చే విషయాన్ని దుష్యంత్ చౌతాలా కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులెవరికీ ముందుగా చెప్పలేదని రామ్ కుమార్ గౌతమ్ ఆరోపించారు. పార్టీ ఉపాధ్యక్షుడినైన తనకే తెలియదని చెప్పారు. గుర్ గావ్ లోని ఓ షాపింగ్ మాల్ లో దుష్యంత్ చౌతాలా ఒంటరిగా బీజేపీతో మంతనాలు సాగించారని ఆరోపించారు. బీజేపీకి మద్దతు ఇవ్వడంపై ఆయన ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తమకు ముందుగా సమాచారాన్ని ఇచ్చి, రాత్రికి రాత్రి ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారని ఫైర్ అయ్యారు. అయితే తాను పార్టీ వీడనని,ఒకవేల పార్టీకి రాజీనామా చేస్తే తన ఎమ్మెల్యే పదవిని కోల్పోతానని,తన నియోజకవర్గప్రజలను తాను ఇబ్బందులకు గురిచెయ్యబోనని రామ్ కుమార్ గౌతమ్ తెలిపారు.