Amarinder Singh: మాజీ ముఖ్యమంత్రి కొత్త పార్టీ.. నేడే అనౌన్స్‌మెంట్?

2022ఎన్నికలకు ముందు పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.

Amarinder Singh: మాజీ ముఖ్యమంత్రి కొత్త పార్టీ.. నేడే అనౌన్స్‌మెంట్?

Amareendhar

Updated On : October 27, 2021 / 8:08 AM IST

Amarinder Singh: 2022ఎన్నికలకు ముందు పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ వ్యూహాత్మక అడుగుల్లో భాగంగా ఇవాళ(27 అక్టోబర్ 2021) కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. విలేకరుల సమావేశంలో కొత్త పార్టీ పేరును ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తనను కాంగ్రెస్‌ పార్టీ అవమానించిందని భావిస్తున్న అమరీందర్.. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు వ్యూహాలు వేస్తున్నారు. కొత్తపార్టీని ప్రకటిస్తానని, బీజేపీతో పొత్తు కూడా ఉంటుందని ఇదివరకే తెలిపారు అమరీందర్‌. అయితే ఏడాదిగా కొనసాగుతున్న రైతుల ఆందోళన సానుకూలంగా పరిష్కారమైనపుడే పార్టీల మధ్య పొత్తు సాధ్యమవుతుందని అన్నారు.

అంతేకాకుండా తమతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న పార్టీలను, వ్యక్తులను కలుపుకుపోతామని స్పష్టం చేశారు అమరిందర్. త్వరలోనే తమ పార్టీకి సంబంధించిన విధివిధానాలను వెల్లడిస్తానని అన్నారు.

పంజాబ్‌ కాంగ్రెస్‌లో పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌సింగ్‌ సిద్ధూతో పొసగకపోవడం.. గొడవలు.. తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా.. వరుస పరిణామాల తర్వాత బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉండి.. చివరకు పార్టీ పెట్టేందుకే మొగ్గుచూపారు అమరిందర్ సింగ్.