ఢిల్లీ వాసులకు నీటి కష్టాలు.. సుప్రీంకోర్టు తలుపుతట్టిన కేజ్రీవాల్ సర్కారు

బీజేపీ మిత్రులు ఆప్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఈ సమయంలో రాజకీయాలకు బదులు అందరం కలిసి ఢిల్లీ ప్రజలకు ఉపశమనం కల్పించాలని చేతులు జోడించి ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను.

ఢిల్లీ వాసులకు నీటి కష్టాలు.. సుప్రీంకోర్టు తలుపుతట్టిన కేజ్రీవాల్ సర్కారు

Arvind Kejriwal expressed concern over water crisis in Delhi

Updated On : May 31, 2024 / 3:27 PM IST

Delhi Water Crisis : మండుతున్న ఎండలకు తోడు ఢిల్లీవాసులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. తాగేందుకు నీళ్లు లేక హస్తివాసులు అల్లాడిపోతున్నారు. భీకర ఎండలకు జలాశయాలు అడుగంటడంతో తాగునీటి కొరత ఏర్పడింది. దీంతో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తింది. నీటిని పొదుపుగా వాడుకోవాలని, వేస్ట్ చేస్తే 2 వేల రూపాయల జరిమానా విధిస్తామని ఢిల్లీ సర్కారు ప్రకటించింది. కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్వాకం వల్లే నీటికొరత ఏర్పడిందని బీజేపీ విమర్శిస్తోంది. ఎండలు మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు మరింత భయపడుతున్నారు. మరోవైపు నీటి కష్టాలు తీర్చాలంటూ సుప్రీంకోర్టు తలుపుతట్టింది ఢిల్లీ సర్కారు.

నీటి సమస్య పరిష్కారానికి బీజేపీ ముందుకు రావాలి: కేజ్రీవాల్
ఢిల్లీ వాతావరణం, నీటి సమస్యపై స్పందించిన సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీ నీటి సమస్య పరిష్కరించేందుకు బీజేపీ ముందుకురావాలని కోరారు. ”బీజేపీ మిత్రులు ఆప్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. నిరసనలతో సమస్య పరిష్కారం కాదు. ఈ సమయంలో రాజకీయాలకు బదులు అందరం కలిసి ఢిల్లీ ప్రజలకు ఉపశమనం కల్పించాలని చేతులు జోడించి ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. బీజేపీ హర్యానా, యూపీ ప్రభుత్వాలతో మాట్లాడి ఢిల్లీకి నెల రోజుల పాటు నీళ్లు అందిస్తే ఢిల్లీ ప్రజలు బీజేపీ చర్యను ఎంతగానో అభినందిస్తారు.

ప్రస్తుతం ఉన్న విపరీతమైన వేడి ఎవరి నియంత్రణలోనూ ఉండదు. అందరం కలిసి పనిచేస్తే ప్రజలకు ఉపశమనం కలిగించగలం. దేశం మొత్తం మునుపెన్నడూ లేని వేడిని అనుభవిస్తోంది. దేశవ్యాప్తంగా నీరు, విద్యుత్ సంక్షోభం ఉంది. గతేడాది ఢిల్లీలో గరిష్టంగా 7438 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. ఈ ఏడాది గరిష్ట డిమాండ్ 8302 మెగావాట్లకు చేరుకుంది. ఢిల్లీలో విద్యుత్ పరిస్థితి అదుపులో ఉంది. ఇతర రాష్ట్రాల మాదిరిగా కరెంటు కోతలు లేవు. ఎండ వేడిమితో ఢిల్లీలో నీటికి డిమాండ్ చాలా పెరిగింది. ఢిల్లీకి పక్క రాష్ట్రాల నుంచి వచ్చే నీరు తగ్గిపోయింది. ఢిల్లీ నీటి సమస్యను అందరం కలిసి పరిష్కరించుకోవాల”ని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

Also Read: తీహార్ జైలులో లొంగిపోతున్నా.. తల్లిదండ్రులు, భార్య గురించి కీలక వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్

కేజ్రీవాల్‌ నిర్వాకం వల్లే నీటి ఎద్దడి: వీరేంద్ర సచ్‌దేవా
నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ బీజేపీ శుక్రవారం ఆందోళన చేపట్టింది. షాహిదీ పార్క్ నుంచి ఢిల్లీ సెక్రటేరియట్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపింది. ”సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నిర్వాకం వల్లే ఢిల్లీలో నీటి ఎద్దడి ఏర్పడిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఈ సందర్భంగా విమర్శించారు. నీటి దుర్వినియోగంపై రూ. 2000 జరిమానా విధిస్తున్నారు. ఇది జరిమానా కాదు.. అవినీతికి మరో మార్గం. ఆప్ ట్యాంకర్‌ మాఫియాలను ప్రోత్సహిస్తోంది. ఆప్ ఎమ్మెల్యేలు ట్యాంకర్ మాఫియాతో కలిసి ఢిల్లీ ప్రజలకు నీటిని అమ్ముకుని దోచుకుంటున్నార”ని వీరేంద్ర సచ్‌దేవా ఆరోపించారు.

Also Read: కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు.. వర్షాలు వచ్చేస్తున్నాయి..

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ ప్రభుత్వం
ఢిల్లీ నీటి సమస్య పరిష్కారం కోసం ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హర్యానా, ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి ఢిల్లీకి నెల రోజుల పాటు అదనపు నీటిని అందించేలా ఆదేశించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఎండల తీవ్రతతో ఢిల్లీకి నీటి అవసరం పెరిగిందని, దేశ రాజధాని అవసరాలను తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యతని పిటిషన్‌లో ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది.