ఏ సిద్ధాంతం కేజ్రీవాల్‌ను పెద్ద నాయకుడ్ని చేసిందో.. అదే సిద్ధాంతానికి విరుద్ధంగా నడిచారంటూ..

Arvind Kejriwal: అవినీతికి వ్యతిరేకం, ప్రజలకు మంచి పాలన అందించడమే పునాదులుగా ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీ.. కొన్నేళ్ల నుంచి అవినీతి..

ఏ సిద్ధాంతం కేజ్రీవాల్‌ను పెద్ద నాయకుడ్ని చేసిందో.. అదే సిద్ధాంతానికి విరుద్ధంగా నడిచారంటూ..

Arvind Kejriwal

అవినీతి వ్యతిరేక ఉద్యమంతో పెద్ద నాయకుడైన కేజ్రీవాల్..అదే అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. ఏ సిద్దాంతమైతే అతడ్ని పెద్ద నాయకుడ్ని చేసిందో..ఆ సిద్ధాంతానికి విరుద్దంగా నడిచారంటూ వచ్చిన ఆరోపణలు ఆయనను విచారణను ఎదుర్కొనేలా చేశాయి. అవినీతికి వ్యతిరేకంగా భారీ ఉద్యమాలు చేపట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అరవింద్ కేజ్రీవాల్.. మూడోటర్మ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్దఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తున్నారు. పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత..ఆప్ పార్టీని అవినీతి సొమ్ముతో నడిపిస్తున్నారన్న విమర్శలు తీవ్రమయ్యాయి.

2020లో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఆప్..అవినీతి ఆరోపణలకు కేరాఫ్ గా మారింది. కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కేజ్రీవాల్‌ వరకు అందరినీ కరప్షన్ అలిగేషన్స్ చుట్టుముట్టాయి. సామాన్యుడి నుంచి అనతికాలంలోనే ఢిల్లీ సీఎంగా ఎదిగిన కేజ్రీవాల్.. అంతే స్పీడుగా ఆరోపణల పాలయ్యారు. 2013లో రాజకీయాల్లోకి వచ్చి.. 2020కి ముందు వరకు మచ్చలేని రాజకీయ నాయకుడిలా.. అవినీతి రహిత ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లుగా పేరు తెచ్చుకున్నారు.

కానీ ఈ మూడేళ్లలోనే గాలికంటే వేగంగా ఆరోపణలు ఆయనను వెంటాడాయి. ప్రతిపక్ష నేతల కుంభకోణాలు, అవినీతిపై విరుచుకుపడే కేజ్రీవాల్‌ చివరకు తానేం తప్పుచేయలేదని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఢిల్లీ ప్రజల్లో కేజ్రీవాల్‌పై అభిప్రాయం ఎలా ఉన్నా.. దేశవ్యాప్తంగా ప్రజలు ఆయనను చూసే కోణం మారుతూ వస్తోంది. ఒకప్పుడు కేజ్రీవాల్ తమ రాష్ట్రంలో ఆప్ ను పోటీలో పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనునేవారు జనం.

కానీ ప్రస్తుత పరిస్థితులు అవినీతికి ఎవరూ అతీతులు కాదన్న చర్చకు దారితీశాయి.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ అవినీతి చేశారా లేదా అన్నది ఇప్పట్లో తేలే అంశం కాదు. కరప్షన్‌కు పాల్పడ్డారని దర్యాప్తు సంస్థలు అంటాయి. ఏ అవినీతి చేయలేదని కేజ్రీవాల్, ఆయన పార్టీ ఆప్ అంటోంది.

అందుకే రాజకీయాల్లోకి..
సెన్సేషనల్ ఎజెండాతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు కేజ్రీవాల్. అప్పటివరకు ఎంతోమంది అవినీతి రహిత పాలన అని గొంతెత్తి అరిచినా.. వారికి ప్రజల్లో చెప్పుకోదగ్గ రెస్పాన్స్ రాలేదు. కేజ్రీవాల్ మాత్రం సామాజిక ఉద్యమ పునాదిగా పార్టీని ప్రారంభించి.. సంచలనం సృష్టించారు. 2013 ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ బంపర్ మెజార్టీతో గెలిచినప్పుడు.. చీపురుతో చెత్తనంతా ఊడ్చేశారని కేజ్రీవాల్‌ గురించి గొప్పగా మాట్లాడుకుంది దేశం. అంతలా ప్రభావితం చేయగలిగారాయన. అయితే మాటల్లోనే కాదు చేతల్లోనూ తన మార్క్‌ చూపించగలిగారు కేజ్రీవాల్.

ఢిల్లీలో పాలన, ప్రజాపథకాలలో తన IRS అనుభవాన్ని చూపించారు కేజ్రీవాల్. గొప్పలకు పోకుండా ప్రజల అవసరాలపై ఫోకస్ పెట్టి.. ఢిల్లీ ప్రజలకు అన్ని వసతులను అందుబాటులోకి తెచ్చారు. అది కాస్త పక్కనే ఉన్న పంజాబ్‌ ప్రజలపై ఎఫెక్ట్ చూపించింది. గోవాతో పాటు మిగతా రాష్ట్రాల్లో ఆప్ ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. ఆతర్వాత దేశవ్యాప్తంగా ఆప్ విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్న సమయంలో..అనూహ్యంగా ఆ పార్టీ, నేతలు కేసుల పాలు కావడం, జైలుకు వెళ్లడం సంచలనంగా మారింది.

అందరూ జైలుకు
కేజ్రీవాల్ క్యాబినేట్ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్రజైన్, ఎంపీ సంజయ్ సింగ్ జైలుకెళ్లారు. వీరంతా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని లోక్ పాల్ బిల్లు కోసం పోరాడినవారే. అందరి మీద ఆరోపణలు చేస్తూ.. అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ నేతలు అధికారంలోకి వచ్చాక అవినీతి ఆరోపణలు ఎదుక్కొని అరెస్ట్ కావాల్సి వచ్చింది.

లిక్కర్ స్కాం కేసులో గతేడాది నుంచి కేజ్రీవాల్‌ను వెంటాడుతూ వచ్చింది ఈడీ. కేసు తెరమీదకు వచ్చిన మొదట్లో సీబీఐ నోటీసులకు రెస్పాండ్ అయ్యారు కేజ్రీవాల్. ర్యాలీగా వెళ్లి సీబీఐ విచారణకు హాజరయ్యారు. సీన్‌ ఈడీకి మారిన తర్వాత మాత్రం కేజ్రీవాల్ రెస్పాండ్ కాలేదు. గతేడాది నవంబర్ నుంచి అరెస్ట్ అయ్యే వరకు తొమ్మిదిసార్లు కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చింది ఈడీ.

గోల్‌మాల్ చేసి..
ఢిల్లీ లిక్కర్ పాలసీలో పెద్ద ఎత్తున గోల్‌మాల్ చేసి.. ఆప్ పార్టీకి డబ్బులు అందేలా చేశారనేది కేజ్రీవాల్ మీదున్న ఆరోపణ. ఆప్ పార్టీకి సౌత్ గ్రూప్‌ నుంచి వంద కోట్ల ముడుపులు అందాయని దర్యాప్తు సంస్థలు చెప్తున్నమాట. దీంతో పార్టీ మూల సిద్ధాంతానికి విరుద్దంగా అవినీతి సొమ్ముతోనే ఆప్ పార్టీని నడుపుతున్నారని..లిక్కర్‌ స్కాంలో వచ్చిన ముడుపులను పంజాబ్‌ ఎన్నికలప్పుడు వాడారని దర్యాప్తు సంస్థలు చెప్పాయి.

అవినీతికి వ్యతిరేకం, ప్రజలకు మంచి పాలన అందించడమే పునాదులుగా ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీ.. కొన్నేళ్ల నుంచి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఆప్‌ పార్టీ దశను మార్చేసింది ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు. 2021లో ఢిల్లీ మద్యం పాలసీ డిజైన్‌లో పెద్దఎత్తున అవినీతి జరిగిందంటూ కేసు నమోదు కావడం ఆమ్ ఆద్మీ పార్టీని, ఢిల్లీ ప్రభుత్వాన్ని షేక్ చేసింది.

ఈ కేసులో అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గతేడాది అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా జైలుకు వెళ్లారు. ఇదే ఢిల్లీ లిక్కర్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో అవినీతికి వ్యతిరేకంగా పోరాడి.. పార్టీ పెట్టిన కేజ్రీవాల్, అతని అనుచరగణం చివరికి ఆ అవినీతి ఆరోపణలతోనే అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.

 Also Read: బైక్‌పై చక్కర్లు కొట్టి.. ఉట్టి కొట్టి.. డ్యాన్స్ చేసి.. అదరగొట్టిన అంబటి రాంబాబు