172రోజుల తర్వాత…అసోం గ్యాస్ బావి మంటలు ఆర్పివేత

Fire Doused Completely After Over 5 Months అసోంలోని బాగ్జన్ గ్యాస్ బావిలో దాదాపు ఆరు నెలల క్రితం ఎగిసిపడిన మంటలను విజయవంతంగా ఆర్పివేసినట్లు ఆదివారం(నవంబర్-15,2020)అయిల్ ఇండియా తెలిపింది. తూర్పు అసోంలోని టిన్సుకియా జిల్లాలో ఉన్న గ్యాస్ బావిలో మంటలు ఎగిసిపడి నిరంతరాయంగా ఆరు నెలలపాటు కొనసాగాయి.
విదేశీ నిపుణుల సహాయం తీసుకుని మంటలను ఎట్టకేలకు పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చినట్లు ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థ అధికార ప్రతినిధి త్రిదేవ్ హజారికా తెలిపారు. ప్రస్తుతం బావిలో ఎటువంటి ఒత్తిడి లేదని, రాబోయే 24 గంటలు పరిస్థితులను గమనిస్తామని ఆయన తెలిపారు. బావిని వదలివేయడానికి తదుపరి ఆపరేషన్ పురోగతిలో ఉన్నదని హజారికా చెప్పారు. సింగపూర్ సంస్థ అలర్ట్ డిజాస్టర్ కంట్రోల్ నిపుణులు బావిని నియంత్రించడానికి తుది ఆపరేషన్ లో చురుకుగా నిమగ్నమైనట్లు ఆయన పేర్కొన్నారు.
టిన్సుకియా జిల్లాలోని బాగ్జన్ వద్ద 5 వ బావి మే 27 నుంచి అనియంత్రితంగా వాయువును వెదజల్లుతున్నది. దాదాపు ఆరు నెలలపాటు గ్యాస్ బావి నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎందరో అధికారులు, సిబ్బంది గాయాలకు గురవ్వగా..పలువురు ప్రాణాలు కోల్పోయారు. జూన్ 9 న మంటలు చెలరేగడంతో ఆయిల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మరణించారు.
సెప్టెంబర్ 9 న, ఓఐఎల్ 25 ఏండ్ల ఎలక్ట్రికల్ ఇంజనీర్ బావి ప్రదేశంలో పనిచేస్తున్నప్పుడు అధిక వోల్టేజ్ విద్యుత్ షాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. విదేశీ, ఆయిలిండియా ఇంజనీర్లు అవిశ్రాంతంగా పోరాటం జరిపి ఎట్టకేలకు మంటలను ఆర్పివేయగలిగారు. విదేశీ నిపుణులను రప్పించి తీవ్రంగా శ్రమించడంతో చివరకు 172 రోజుల తర్వాత మంటలకు ఫుల్‌స్టాప్ పెట్టారు.