మోడీకి వ్యతిరేకంగా fb పోస్టు పెట్టాడని అస్సాం టీచర్ అరెస్ట్

అస్సాం రాష్ట్రంలోని ఓ కాలేజిలో విద్యార్థులు ఇచ్చిన కంప్లైంట్‌కు టీచర్‌ను అరెస్టు చేశారు పోలీసులు. క్లాస్ రూంలో స్టూడెంట్స్ ముందు చేసిన పనికి కాదు కంప్లైంట్.. తన పర్సనల్ fb (facebook) అకౌంట్లో మోడీకి వ్యతిరేకంగా అభ్యంతరకర పోస్టు పెట్టారు టీచర్. ప్రధాని మోడీ వైఖరి మొత్తం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు అనుగుణంగా, హిందువులకు అనుకూలంగానే ఉంటుందంటూ అందులో పేర్కొన్నారు.
హిందూ కమ్యూనిటీకి వ్యతిరేకంగా, సనాతన ధర్మాన్ని ధిక్కరిస్తూ సేన్‌గుప్తా అనే వ్యక్తి వివాదాస్పద కామెంట్లు చేస్తున్నారని విద్యార్థుల గ్రూపు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. సేన్‌గుప్తా గురుచరణ్ కాలేజీలో ఏడాదిగా పనిచేస్తున్నారు. ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై తరచూ పోస్టులు చేస్తూనే ఉన్నారు. దేశ రాజధానిలో 2002లో గుజరాత్ అల్లర్ల పరిస్థితిని తిరిగి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు పలు పోస్టులు పెట్టారు.
కొంతసేపటికి సేన్‌గుప్తా fbలో పోస్టులను డిలీట్ చేసేశారు. ఏ మతాన్ని అయినా కించపరిచినట్లుగా అనిపిస్తే క్షమించాలని కోరారు. మతానికి సంబంధించిన విషయంలో కాస్త బాధ్యతారాహిత్యంగానే స్పందించాను. న్యాయం కోసం రాశాను తప్ప ఏ ఒక్క మతాన్నో కించపరచడం నా ఉద్దేశ్యం కాదు’ అని గురువారం మరో పోస్టు పెట్టాడు.
సేన్‌గుప్తాపై పలు కేసులు నమోదయ్యాయి. మతపరమైన భావనలు రెచ్చగొడుతున్నాడని, విభిన్న గ్రూపుల్లో శత్రుత్వం పెరిగేలా చేస్తున్నాడని, క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నాడంటూ కేస్ ఫైల్ చేశారు. 40మంది స్టూడెంట్లు అతని ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పారు. అతణ్ని విడుదల చేయమని పోలీసులను రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.