Ayodhya Ram Mandir
యావత్ భారత్ చూపు అయోధ్య వైపు మళ్లింది. హిందువుల 500 ఏళ్ల నాటి కల నెరవేరుతున్న తరుణమిది. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవాన్ని కేంద్రం, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 54 దేశాల నుంచి 100 మంది ప్రతినిధులు బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. దేశంలోనూ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులను పండితులను, మఠాధిపతులను, మత గురువులను ఆహ్వానించారు.
జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవానికి దేశ, విదేశాల నుంచి అతిథులను ఆహ్వానించారు. 54 దేశాలకు చెందిన 100 మంది ప్రతినిధులు ఈ మహాక్రతువులో పాల్గొనేందుకు వస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వానికి వర్తమానం పంపారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, మారిషస్, ఆఫ్రికా దేశాల ప్రతినిధులు అధికారికంగా హాజరవుతున్నారు. ఇక దేశంలో వివిధ రంగాలకు చెందిన 506 మంది ప్రముఖులను అతిథులుగా ఆహ్వానించారు.
విదేశీ ప్రతినిధుల్లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ చిల్-సు కూడా ఉన్నారు. అతను క్వీన్ హియో రాజవంశానికి చెందినవారు. సూరిరత్న అని కూడా పిలిచే క్వీన్ హియో.. అయోధ్య యువరాణిగా చెబుతారు. ఈమె కొరియాకు వెళ్లి కరక్ రాజవంశాన్ని ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక ఈ మహోన్నత ఘట్టంలో భాగమవుతున్న మన దేశ ప్రముఖుల్లో ప్రధాని మోదీతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి చిరంజీవికి ఆహ్వానాలు పంపారు.
అతిథుల విడిది..
అతిథుల విడిది, ఇతర సౌకర్యాలపైనా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఈ మహా క్రతువులో పాల్గొని రాముడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 11 వేల మంది అతిథులకు ఆహ్వానాలు పంపింది అయోధ్య ట్రస్టు అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేస్తోంది.
అయోధ్యలో హోటళ్లు, అతిథి గృహాలు, డార్మిటరీల్లో రూమ్‌లను ఇప్పటికే బుక్‌చేసింది. ఇక ధర్మశాలలు, పేయింగ్ గెస్ట్, టెంట్ సిటీ, షెల్టర్ సైట్లు సిద్ధం చేశారు. అతిథుల కోసం 60 హోటళ్లు, 171 ధర్మశాలలు, 17 హాళ్లను బుక్ చేశారు. అంతేకాకుండా రాముని ప్రాణప్రతిష్ఠకు వచ్చే అతిథులకు రామజన్మభూమి పునాది మట్టి, నెయ్యితో చేసిన 100 గ్రాముల మోతీచూర్ లడ్డు, ఓ సీసాలో సరయూ నది నీరును బాక్సులో పెట్టి గిఫ్ట్‌గా ఇవ్వనున్నారు.
పకడ్బందీగా చర్యలు
ఇక భద్రతాపరంగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాని మోదీ సహా సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ఆలయ ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో బలగాలతోపాటు అధునాతన ఆయుధ వ్యవస్థను రంగంలోకి దించుతున్నారు. అయోధ్య జిల్లాలో 10 వేల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వ్యూహాత్మక ప్రాంతాలలో యాంటీ డ్రోన్ సాంకేతికతను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రాణప్రతిష్ఠ తర్వాతే సామాన్యభక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ప్రతిరోజూ ఉదయం ఏడు గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు భక్తులు జగదభిరాముణ్ని దర్శించుకోవచ్చు. శ్రీరామచంద్రునికి రోజూ మూడు హారతులిస్తారు. ఉదయం ఆరున్నర గంటలకు శృంగార్ హారతి, మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి, రాత్రి ఏడున్నరగంటలకు సంధ్యాహారతినిస్తారు. భక్తులందరికీ ఉచిత ప్రవేశం అందుబాటులో ఉంటుంది. అయితే ప్రత్యేక దర్శనానికి మాత్రం వంద నుంచి 300 రూపాయల టికెట్ ధర ఉంటుంది.
మొత్తంగా అయోధ్య… భారతీయ ఆధ్యాత్మికతకు చిరునామాగా మారుతోంది. ఇప్పటికే అయోధ్య రూపురేఖలు మారిపోయాయి. అయోధ్య రైల్వేస్టేషన్ పునర్‌నిర్మాణం, అయోధ్య ఎయిర్‌పోర్టుల నిర్మాణంలో కూడా రామాయణం స్ఫూర్తే కనిపిస్తోంది. ఇకనుంచి అయోధ్య ప్రపంచ పర్యాటకులకు కేంద్రంగా మారనుంది. అంతేకాదు.. రామజన్మభూమిలో బాలరాముని ప్రాణప్రతిష్టతో భారతదేశ ముఖచిత్రం కూడా మారబోతోంది.
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరానికి సెలబ్రిటీలు ఎంతెంత ఇచ్చారో తెలుసా?