Baba Siddique Son : పోరాటం ఇంకా ముగియలేదు.. ఆ సింహం రక్తం నా నరనరాల్లో ఉంది.. జీషన్ సిద్ధిఖీ!
Baba Siddique Son : నా తండ్రిని చంపేశారు. ఆయన లేకున్నా ఆ స్థానంలో ఎదిగాను. ఆ పోరాటం ఇప్పుడే ముగియదు. నాన్న ఉన్న చోటే నేను ఉన్నాను.

Baba Siddique's son dares killers ( Image Source : Google )
Baba Siddique Son : మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. శాసనసభ్యుడు జీషన్ సిద్దిఖీ కూడా హంతకుల హిట్ లిస్టులో ఉన్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తండ్రి మరణానికి కారణమైనవారిపై ఎమ్మెల్యే జీషన్ సిద్ధిక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా వేదికగా తొలిసారిగా స్పందిస్తూ తన తండ్రి బాబా సిద్ధిఖీ హంతకులకు హెచ్చరికలు పంపాడు. నా తండ్రిని హత్య చేయడంతో యుద్ధం ముగిసినట్టు కాదన్నారు. తాను ఇంకా బతికే ఉన్నానని, ధైర్యంతో ముందుకు వెళ్తున్నాను.. అన్నింటికి సిద్ధంగా ఉన్నాను.. ఎందుకంటే.. నేను సింహం కొడుకుని..’’ అంటూ జీషన్ తెలిపారు.
‘నా తండ్రిని చంపి ఆయన మాట మూగబోయేలా చేశారు. కానీ, ఆయన సింహం అనే విషయాన్ని మరిచిపోయారు. ఆయన సింహగర్జనను నేను కొనసాగిస్తాను. నా తండ్రి పోరాటం నా నరనరాల్లో జీర్ణించుకుంది. న్యాయం వైపే ఎప్పుడూ ఉండేవారు. మార్పు కోసమే ఆయన శ్రమించి పోరాడారు. తుఫానులు వచ్చినా చెక్కుచెదరని ధైర్యం.. ఆయన ప్రాణాలను తీసినవారు తాము ఏదో గెలిచామనుకోవచ్చు. నన్ను కూడా ఏదో చేయాలని చూస్తున్న వారికి నేను చెప్పేది ఒక్కటే.. సింహం రక్తం నా నరనరాల్లోనూ ప్రవహిస్తోంది” అంటూ జీషన్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
హంతకులను వదిలే ప్రసక్తే లేదు :
తన తండ్రిని చంపిన హంతకులకు జీషన్ సిద్ధిఖీ హెచ్చరించారు. ఎవరికి భయపడేది లేదని, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. నా తండ్రిని చంపేశారు. ఆయన లేకున్నా ఆ స్థానంలో ఎదిగాను. ఆ పోరాటం ఇప్పుడే ముగియదు. నాన్న ఉన్న చోటే నేను ఉన్నాను. అలైవ్ రెలెంట్ లెస్.. రెడీ అంటూ పేర్కొన్నారు.
They silenced my father. But they forget – he was a lion—and I carry his roar within me, his fight in my veins. He stood for justice, fought for change and withstood the storms with unwavering courage. Now, those who brought him down turn their sights on me assuming they’ve won,…
— Zeeshan Siddique (@zeeshan_iyc) October 20, 2024
ప్రజలు, గృహాల పరిరక్షణకు తన తండ్రి ప్రాణాలు కోల్పోయారని, ఆయన మరణంతో తన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయిందని, తప్పక న్యాయం జరగాలని కోరుకుంటున్నామని జీషన్ సిద్ధిఖీ తెలిపారు. ముంబైలోని కుమారుడి జీషన్ కార్యాలయం వద్ద మాజీ మంత్రి బాబా సిద్ధిఖిని దుండగులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కుమారుడు జీషన్ సిద్ధిఖీ కూడా హంతకుల హిట్ లిస్టులో ఉన్నట్టుగా నిందితులు విచారణలో బయటపెట్టారు.
ఇదిలా ఉండగా, హంతకులకు లాజిస్టిక్ సపోర్ట్ అందించిన ఐదుగురిని గతవారమే పోలీసులు అరెస్టు చేశారు. వారిలో నితిన్ గౌతమ్ సప్రే (32), సంభాజీ కిసాన్ పార్ధి (44), ప్రదీప్ దత్తు థోంబ్రే (37), చేతన్ దిలీప్ పార్ధి, రామ్ ఫుల్‌చంద్ కనౌజియా (43)గా గుర్తించారు. బాబా సిద్ధిఖీను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేసిందని శుభమ్ లోంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పోస్ట్ ప్రకారం.. నటుడు సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉన్నందున ఆయన్ను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. ఈ కేసులో ప్రధాన షూటర్ శివకుమార్ గౌతమ్, సూత్రధారులు శుభమ్ లోంకర్, మహమ్మద్ జీషన్ అక్తర్ పరారీలో ఉన్నారు. ముగ్గురు నిందితులపై పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ) జారీ చేశారు.