దేశంలోనే తొలిసారి : అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా పాజిటివ్… తల్లికి నెగిటివ్

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. అయితే కరోనా సోకిన గర్భిణిలకు పుట్టే శిశువులకు వైరస్ సోకిన వార్తలు వింటూనే ఉన్నాం. తాజాగా కరోనా వైరస్ నెగిటివ్ వచ్చిన ఓ మహిళకు పుట్టిన బిడ్డకు కరోనా పరీక్ష చేయగా, ఆ బిడ్డకు పాజిటివ్ అని తేలింది. ఈ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో గర్భంతో ఉన్న ఓ మహిళ జూన్ 11,2020 న రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రిలో కరోనా వైరస్ తో చేరింది. ఆమె నుంచి తన భర్తకు కరోనా సోకడంతో ఇద్దరు అదే ఆసుప్రతిలో చికిత్స తీసుకుంటున్నారు.ఈ క్రమంలోనే జూన్ 25,2020న మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆమెకు మళ్లీ పాజిటివ్ అనే వచ్చింది. దాంతో మరికొన్ని రోజులు చికిత్స తర్వాత జూలై 7,2020 న మూడోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష ద్వారా కరోనా జరపగ, నెగిటివ్ అని వచ్చింది.
కోవిడ్ నెగిటివ్ వచ్చిన తర్వాతి రోజు ఆర్ఎమ్ఎల్ ఆసుప్రతిలో ఆ మహిళ పడండి బిడ్డకు జన్మనిచ్చింది. ఆరు గంటల తర్వాత వైద్యులు ఆ శిశువు కరోనా పరీక్ష కోసం శాంపిల్స్ ను సేకరించారు. ఆ శాంపిల్ లో బిడ్డకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. దీంతో వైద్యులు ఆశ్చర్యాన్నికి గురయ్యారు. తల్లికి కరోనా వైరస్ నెగిటివ్ నిర్ధారణ అయిన తర్వాతే బిడ్డకు జన్మనిచ్చింది. అయినా బిడ్డకు పాజిటివ్ ఎలా వచ్చిందనే విషయం పై వైద్యులు ఆందోళన పడుతున్నారు.
ఆర్ఎమ్ఎల్ ఆసుపత్రి వైద్యులు రాహుల్ చౌదరి మాట్లాడుతూ.. తల్లి బొడ్డుతాడు నుంచి బిడ్డకు కరోనా వ్యాపించే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు. కానీ, ప్రస్తుతం ఆ శిశువుకు చికిత్సను అందిస్తున్నామని తెలిపారు. కరోనా నెగిటివ్ ఉన్న తల్లి గర్భంలోని శిశువుకు కరోనా సోకడమనేది దేశంలోనే తొలి కేసుగా డాక్టర్ చౌదరి పేర్కొన్నారు.