బ్యాంకుల రుణమేళా : అప్పులిస్తాం తీసుకోండి బాబూ

అప్పు.. అప్పు.. అప్పు.. ఇప్పటి వరకు ఈ మాట అడిగితే రేపు.. రేపు.. రేపు అనేవారు. ఇప్పటి నుంచి లెక్క మారింది. అప్పులిస్తాం రండి బాబూ అంటూ ఆహ్వానిస్తున్నాయి బ్యాంకులు. విచిత్రం కాదు.. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో మేళాలు పెట్టి మరీ అప్పులివ్వటానికి సిద్ధం కావటం విశేషం.
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలనుకునేవారికి ఇది శుభవార్త అంటోంది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయంపై రైతులు, గృహ కొనుగోలుదార్లు, ఇతరత్రా రుణాలు తీసుకునేవారికి అప్పులు విరివిగా ఇవ్వాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), చిన్న రుణ గ్రహీతలతో ప్రభుత్వ రంగ బ్యాంకులు సమావేశాలు ఏర్పాటు చేయనున్నాయి. దేశవ్యాప్తంగా 400 జిల్లాలో రెండు దశల్లో ఈ రుణ మేళాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సంచలన ప్రకటన చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
మొదటి దశలో భాగంగా 200 జిల్లాల్లో.. అక్టోబరు 3 నుంచి 7వ తేదీ వరకూ బ్యాంకుల్లో రుణమేళాలు ఉంటాయి. రెండో దశ అక్టోబరు 11 నుంచి ప్రారంభం అవుతుంది. ఫస్ట్ ఫేజ్ లో మిస్ అయితే.. రెండో దశలో అప్పు తీసుకోవచ్చు. పండగ సీజన్లో ఎక్కువ మందికి అప్పులు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ ఆలోచన చేసినట్లు కూడా చెబుతోంది కేంద్ర ఆర్థిక శాఖ. వ్యవసాయ, ఎంఎస్ఎమ్ఈ, హౌస్ లోన్, రిటైల్ రంగాలకు అప్పులు బాగా ఇస్తాం.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆఫర్ ఇస్తున్నాయి ఆయా బ్యాంకులు. అప్పు తీసుకోవటం మర్చిపోవద్దన్న భారీ ఎత్తున ప్రచారం కూడా చేయటం విశేషం.
ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈ రుణాలను 2020 మార్చి వరకు నిరర్థక ఆస్తులుగా ప్రకటించవద్దంటు కూడా బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగానే.. ఒత్తిడిలో ఉన్న చిన్న పరిశ్రమల అప్పు ఖాతాలను నిరర్థక ఆస్తులుగా ప్రకటించవద్దంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్క్యూలర్ జారీ చేసింది. ఒకవేళ 2020 మార్చి వరకు ఎంఎస్ఎంఈ రుణాలను నిరర్థక ఆస్తులుగా ప్రకటించకపోతే.. ఈ రంగానికి ఎంతో మేలు చేసినట్లే’ అని ఆర్థిక శాఖ తన విజన్ ప్రకటించటం విశేషం.