స్పెషలిస్ట్ లు : ఊరంతా అడుక్కుంటోంది

నగల్ దర్బారీ గ్రామం స్పెషల్
గ్రామంలో 30 కుటుంబాలు
పాములు ఎలా పట్టాలో నేర్పేందుకు ఓ స్కూల్
గ్రామస్థులంతా భిక్షాటనతోనే జీవనం
పాములతో బెదిరిస్తారు
మెయిన్‌పురి : ఎవరైనా తాము కష్టపడినా..తమ పిల్లలు మాత్రం గొప్పగా బతకాలనీ..తమకంటే ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆశపడతారు..దాని కోసం తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడతారు. పిల్లల భవిష్యత్తు కోసం ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలోని నగల్ దర్బారీ గ్రామస్థులు మాత్రం అలా అనుకోరు. మరి ఆ విచిత్రమైన గ్రామస్థుల గురించి తెలుసుకుందాం..
బెవర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగల్ దర్బారీ అనే ఈ గ్రామంలో 30 కుటుంబాలవారు ఉంటున్నారు. వీరంతా పేదలే. దేశం అభివృద్ధి బాటలో పయనిస్తున్నా..ఇక్కడి జనం మాత్రం ఇప్పటికీ మట్టితో కట్టుకున్న ఇళ్లలోనే ఉంటున్నారు. పైగా వీరి ఇళ్లకు తలుపులు కూడా ఉండవు. ఆ ఊరికి సరైన రోడ్డు మార్గం కూడా లేదు. అంతేకాదు తాగటానికి నీరు..కరెంట్ ఫెసిలిటీస్ కూడా అంతంత మాత్రమే..ఈనాటికి అక్కడ కరెంట్ లేని ఇళ్లు ఎన్నో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు.
ఎప్పుడో..1958లో జౌహరీనాథ్ అనే ఓ వ్యక్తి తండ్రి ఖ్యాలీనాథ్ కుటుంబంతో సహా ఈ గ్రామానికి వలస వచ్చాడు. పాములు పట్టేవాడు..వాటిని ఆడిస్తు జీవనాన్ని సాగించేవాడు. తినటానికి కూడా ఆ వచ్చిన డబ్బు సరిపోకపోవటంతో భిక్షాటన చేసేవాడు.చివరికి ఇదే రాను రాను వారి కుటుంబ వృత్తిగా మారిపోయింది. గ్రామంలో పాములు పట్టే విధానాలు నేర్పేందుకు పాఠశాల ఏర్పాటుచేశారు. ఇక్కడి చిన్ననాటి నుండే పాముల్ని పట్టుకోవటం నేర్చుకుంటారు.
గ్రామంలో ప్రస్తుతం 200కు మించిన జనాభా ఉంది. వీరిలోని చాలామంది రోజుకు రూ. 100 వరకూ సంపాదిస్తుంటారు. గ్రామానికి చెందిన కొంతమంది పాములను చూపించి బెదిరింపులకు పాల్పడుతూ బిచ్చమెత్తుకోవటం కూడా అలవాటు చేసుకున్నారు. దీంతో పోలీసులు వారిని పట్టుకుని జైలు పంపించటం..తిరిగి వచ్చి మళ్లీ మళ్లీ అదే చేయటం అలవాటుగా మారిపోయింది ఆ గ్రామస్థులకు. ఒకవైపు భిక్షం ఎత్తుకోవటం..మరోపక్క సందర్భాలను బట్టి పాములతో బెదిరింపులకు పాల్పడటం ఆ గ్రామస్థులకు అలవాటుగా మారిపోయింది. ఎన్నిసార్లు జైలుకు వెళ్లి వచ్చినా వారు అదే పనిచేస్తుంటారని పోలీసులు తెలిపారు.