కూతురి పెళ్లి కోసం 19 ఏళ్ల క్రితం భూమిని అమ్మిన తండ్రి.. ఇప్పుడు భూమి కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి పరిహారం అడుగుతున్న కూతురు
అన్ని పత్రాలు చట్టపరంగా సరిగ్గానే ఉన్నప్పటికీ, ఇప్పుడు విక్రయదారుని కుమార్తె తన నుంచి నష్టపరిహారం డిమాండ్ చేస్తోందని తెలిపాడు.

Representative image
ఒక తండ్రి తన కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం గతంలో బెంగళూరులోని భూమిని అమ్మాడు. దాదాపు 19 సంవత్సరాలు గడిచిపోయిన తరువాత ఇప్పుడు అతడి కూతురు తాను నష్టపోయానంటూ భూమి కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి పరిహారం అడుగుతోంది.
బెంగుళూరులో 19 సంవత్సరాల క్రితమే ముగిసిన భూమి విక్రయ వ్యవహారం ఇప్పుడు న్యాయపరమైన వివాదానికి దారితీయడం చర్చనీయాంశంగా మారింది. తనను సంప్రదించకుండా భూమిని అమ్మేశారంటూ ఆ భూమికి చెందిన ప్రస్తుత యజమానులకు విక్రయదారుని కుమార్తె లీగల్ నోటీసు పంపింది.
అప్పట్లో ఆ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి కుమారుడు ఈ విషయంపై తాజాగా Redditలో ఈ వివరాలు తెలిపారు. తన తండ్రి అప్పట్లో కొన్న ఆ భూమికి ప్రస్తుత యజమాని ఇతడే.
తన తండ్రి 2006లో బీబీఎంపీ పరిధిలో భూమిని కొనుగోలు చేశారని, అప్పట్లో పవర్ ఆఫ్ అటార్నీ (Power of Attorney) లేకుండా నేరుగా విక్రయదారు అమ్మేశాడని తెలిపాడు. POA లేనే లేదని అంటూ అతను స్పష్టం చేశాడని చెప్పాడు. ఆ భూమిని కొన్న తర్వాతి నుంచి తాము ఆ భూమిపై రెగ్యులర్‌గా ప్రాపర్టీ టాక్స్ చెల్లిస్తున్నామని తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఖాతా సర్టిఫికెట్ కూడా తన తండ్రి పేరిటనే ఉందని అన్నాడు.
అన్ని పత్రాలు చట్టపరంగా సరిగ్గానే ఉన్నప్పటికీ, ఇప్పుడు విక్రయదారుని కుమార్తె తన నుంచి నష్టపరిహారం డిమాండ్ చేస్తోందని తెలిపాడు. తనను సంప్రదించకుండా 19 ఏళ్ల క్రితం ఆ భూమి అమ్మకం జరిగిందని ఆమె అంటోందని చెప్పాడు. భూమి అమ్మకం సమయానికి ఆమె మేజరేనని.. పైగా, ఆ భూమిని ఆమె తండ్రి ఆమె పెళ్లి కోసమే అమ్మాడని అన్నాడు.
కొన్ని నెలల క్రితం ఆ మహిళ సోదరుడు కూడా ఈ వ్యవహారాన్ని స్నేహపూర్వకంగా పరిష్కరించుకుందామని అన్నాడని తెలిపాడు. కానీ, కొన్ని రోజుల క్రితం లాయర్ సంప్రదించుకోవాలని, తాము కూడా న్యాయపరంగా ముందుకెళ్తున్నామని చెప్పాడని అన్నాడు.
మళ్లీ ఇప్పుడు తన సోదరితో సెటిల్మెంట్ చేసుకోవాలని చూస్తున్నామని, కోర్టుకు వెళ్లవద్దని తమపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిపాడు. ఒకవేళ జడ్జి ఆమెకు అనుకూలంగా తీర్పు ఇస్తే మీరేమి చేస్తారు? అని కూడా అంటున్నాడని చెప్పాడు.
ఈ పోస్ట్ Redditలో వైరల్ అయ్యింది. ఒక నెటిజన్ స్పందిస్తూ.. “2006 అమ్మకపు డీడ్‌లు, సర్వేలు మీ పేరుపై ఉంటే మీరు సేఫ్. ముందు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయో లేదో చూసుకోండి” అని సలహా ఇచ్చాడు.