ట్రంప్‌కు నోబెల్ శాంతి పురస్కారం కోసం నామినేట్ చేసిన పాకిస్థాన్.. తనకు 5 సార్లు నోబెల్ రావాలన్న అమెరికా అధ్యక్షుడు
"భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న సమస్యను పరిష్కరించడానికి నేను ప్రయత్నించాను. అందుకే నన్ను నోబెల్ బహుమతికి ఎంపిక చేయాలి" అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తనకు ఒకసారి కాదు, ఏకంగా నాలుగు- ఐదుసార్లు నోబెల్ శాంతి పురస్కారం దక్కాలని, కానీ పక్షపాత వైఖరి వల్ల తనకు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించింది తానేనని ఆయన పేర్కొనగా, ఈ విషయంపై భారత్, పాకిస్థాన్ ఇప్పటికే భిన్నంగా స్పందించాయి. ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాక్ కూడా నామినేట్ చేసింది. అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
నోబెల్ బహుమతిపై ట్రంప్ ఏమన్నారు?
ఓ విలేకరి ఇటీవల నోబెల్ శాంతి బహుమతి నామినేషన్‌పై ప్రశ్నించగా, డొనాల్డ్ ట్రంప్ ఇలా సమాధానమిచ్చారు. “భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న తీవ్రమైన సమస్యను పరిష్కరించడానికి నేను ప్రయత్నించాను. అందుకే నన్ను నోబెల్ బహుమతికి ఎంపిక చేయాలి. అంతేకాదు, కాంగో-రువాండా దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ఒక కీలక ఒప్పందం చేశాను. దానిపై సోమవారం సంతకం చేస్తారు” అని అన్నారు.
“నిజానికి నాకు నాలుగు – ఐదుసార్లు ఈ బహుమతి రావాలి. కానీ నోబెల్ కమిటీ వాళ్లు కేవలం లిబరల్స్‌కు (ఉదారవాదులకు) మాత్రమే బహుమతులు ఇస్తారు, అందుకే నాకు ఇవ్వరు” అని ట్రంప్ ఆరోపించారు.
ట్రంప్‌కు పాకిస్థాన్ మద్దతు
పాకిస్థాన్ ప్రభుత్వం తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా దీనిపై స్పందిస్తూ.. “ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలను తగ్గించడంలో ట్రంప్ నాయకత్వం కీలక పాత్ర పోషించింది. ఈ కారణంగా ఆయన 2026 నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు” అని పేర్కొంది.
అయితే, ఈ విషయంలో ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారన్న వాదనను భారత ప్రభుత్వం మొదటి నుంచీ అంగీకరించడం లేదు. తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటామని, మూడో వ్యక్తి ప్రమేయం అవసరం లేదని భారత్ స్పష్టం చేసింది.
ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ తాను చేసిన శాంతి ప్రయత్నాలకు నోబెల్ బహుమతి ఆశిస్తుండగా, పాకిస్థాన్ ఆయనకు మద్దతు తెలుపుతోంది. మరోవైపు, అసలు భారత్-పాక్ విషయంలో మధ్యవర్తిత్వమే జరగలేదని భారత్ తేల్చిచెబుతోంది.