వారం రోజుల వ్యవధిలో 100 బాంబు బెదిరింపు కాల్స్..! భారత విమానాలకు కొత్త టెన్షన్..!

లండన్, ఢిల్లీ, దుబాయ్, జైపూర్ విమానాల్లో బాంబు పెట్టామంటూ బెదిరింపులు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

వారం రోజుల వ్యవధిలో 100 బాంబు బెదిరింపు కాల్స్..! భారత విమానాలకు కొత్త టెన్షన్..!

Indian Flights Bomb Threats (Photo Credit : Google)

Updated On : October 19, 2024 / 11:25 PM IST

Indian Flights Bomb Threats : భారత విమానాలకు వారం రోజుల వ్యవధిలో 100 బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ నెల 14న 6, 15న 7, 16న 9, 17న 11 కాల్స్ వచ్చాయి. ఈ నెల 18న 12 కాల్స్, 19న 30 బాంబు బెదిరింపు ఫేక్ కాల్స్ వచ్చాయి. దీంతో ఫేక్ బాంబు కాల్స్ పెద్ద తలనొప్పిగా మారాయి. విమానాలకు వరుస బాంబు బెదిరింపులు ఆగడం లేదు. ఇవాళ మరో 30 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. లండన్, ఢిల్లీ, దుబాయ్, జైపూర్ విమానాల్లో బాంబు పెట్టామంటూ బెదిరింపులు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

లండన్, ఢిల్లీ, విస్తారా విమానాలను వెంటనే జర్మనీకి దారి మళ్లించారు. దుబాయ్-జైపూర్ ప్లేన్ లో బాంబు ఉందంటూ మెయిల్ రావడంతో జైపూర్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన అధికారులు.. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

వరుస బాంబు బెదిరింపు కాల్స్ భారత పౌర విమానయాన శాఖను కొంత కలవరానికి గురి చేస్తున్నాయి. 7 రోజుల వ్యవధిలో 100 బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. వివిధ ఎయిర్ లైన్స్ కు, వివిధ మార్గాల్లో వెళ్తున్న విమానాల్లో బాంబు అమర్చాము అంటూ వచ్చే కాల్స్ కానీ, మెయిల్స్ కానీ.. అటు ప్రయాణికులను, ఇటు పౌర విమానయాన సంస్థలను, అలాగే ప్రభుత్వాన్ని కొంత కలవర పెడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఏకంగా 30 బాంబు బెదిరింపు ఫేక్ కాల్స్ రావడం.. విమానాలను ఐసోలేషన్ ప్లేస్ లో ఉంచడం, ప్రయాణికులను విమానం నుంచి వెకేట్ చేయించడం, అలాగే ముమ్మరంగా తనిఖీలు చేయడం.. ఈ వ్యవహారం అటు సిబ్బందికి, ఇటు ప్యాసింజర్లకు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్న పరిస్థితి ఉంది.

ఈ నెల 14 నుంచి ఈ ఐదు రోజుల్లో 100 వరకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అనేక విమానాలను ఐసోలేషన్ ప్లేస్ కి తరలించడం, తనిఖీలు చేయడం, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం.. ఎయిర్ లైన్స్ సంస్థలకు ఆర్థికంగా పెను భారంగా మారుతోంది. అటు ప్రయాణికుల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. గతంలో ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ కు ఇదే తరహాలో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. విదేశాల నుంచి డార్క్ వెబ్ నుంచి ఈ తరహా కాల్స్, మెయిల్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి డిఫెన్స్ విభాగంలో ఉన్న ఐటీ విభాగం కూడా బాంబు బెదిరింపు ఫేక్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది తెలుసుకునే పనిలో ఉంది.

బాంబు బెదిరింపు ఫేక్ కాల్స్ వల్ల ఎయిర్ లైన్స్ కు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిపోతోంది. అదే సమయంలో ఎయిర్ లైన్స్ కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. ఆర్థిక భారం పెరుగుతోంది. ఒక్కో ఫేక్ కాల్ కారణంగా రూ.3 కోట్ల వరకు నష్టపోతున్నట్లు అధికారులు అంచనా వేశారు. విమానాన్ని దారి మళ్లిస్తే అదనపు ఫ్యూయల్ కోసం కోటి రూపాయల వరకు ఖర్చు అవుతోంది. ఇక ఫ్లైట్ ల్యాండింగ్, ఎయిర్ పోర్ట్ పర్మిషన్లు, ప్రయాణికులకు లాడ్జింగ్, బోర్డింగ్, ఫుడ్, ఇతర అవసరాలకు మరో 2 కోట్ల రూపాయలు కావాల్సి వస్తోంది. ఇప్పటివరకు వచ్చిన ఫేక్ కాల్స్ వల్ల కంపెనీలపై 80 కోట్ల రూపాయల అదనపు భారం పడినట్లుగా అంచనా.

Also Read : ఒకప్పుడు ఇన్ఫోసిస్‌లో ఆఫీస్‌ బాయ్‌.. ఇప్పుడు రెండు కంపెనీలకు యజమాని