Bengaluru 50 Crore Dog: 50 కోట్లతో కుక్కను కొన్న బెంగళూరు వ్యక్తి వ్యహారంలో బిగ్ ట్విస్ట్.. ఈడీ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్.. ఫిబ్రవరిలో తాను అమెరికా నుంచి కాడబోమ్స్ ఒకామి అనే కుక్కను 50 కోట్లకు కొన్నానని, అది అరుదైన తోడేలు కుక్కని చెప్పాడు.

Bengaluru 50 Crore Dog: తాను 50 కోట్లు పెట్టి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కుక్కను కొన్నానని ఇటీవల బెంగళూరుకు చెందిన సతీశ్ అనే వ్యక్తి గొప్పలు చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కట్ చేస్తే.. ఆ శునకం యజమాని నిజస్వరూపం బట్టబయలైంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి.
సతీశ్ 50 కోట్లు పెట్టి కుక్కను కొన్న విషయం తెలుసుకుని ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఫెమా (ఫారిన్ ఎక్స్ చేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్) చట్టాన్ని ఉల్లంఘించి ఉండొచ్చని లేదా అవినీతికి పాల్పడి ఉండచ్చనే అనుమానంతో ఈడీ అధికారులు సీన్ లోకి వచ్చారు. బెంగళూరులోని జేపీ నగర్‌లోని శునకం యజమాని సతీశ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సతీశ్ గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి.
సతీశ్ కు అంత సీన్ లేదని తేలింది. సతీశ్ దగ్గర అంత డబ్బు లేదని అధికారులు గుర్తించారు. 50 కోట్ల విలువైన కుక్కను అతడు కొనుగోలు చేసినట్లు పత్రం లేదా రుజువు ఏదీ అతడి దగ్గర లేదని ఈడీ అధికారులు గుర్తించారు. సతీశ్ బ్యాంకు ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పెద్ద మొత్తంలో లావాదేవీలు ఏవీ జరగలేదని ఈడీ అధికారులు గుర్తించారు. అతడి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, కోట్ల విలువైన కుక్కను కొనగలిగే ఆస్తి లేదా ఆదాయం అతనికి లేదని విచారణలో వెలుగుచూసింది. అంతేకాదు.. మీడియాలో ఫేమస్ అయ్యేందుకే సతీశ్ ఇలా బిల్డప్ ఇచ్చాడేమోనని డౌట్ పడుతున్నారు అధికారులు.
ఆ కుక్క విదేశీ జాతికి చెందినదని సతీశ్ చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోవచ్చని ఈడీ వర్గాలు తెలిపాయి. ఆ శునకం భారతీయ జాతికి చెందినదిగా కనిపిస్తోందని, ఈ వ్యవహారంలో లోతైన దర్యాప్తు జరుగుతోందని ఈడీ వర్గాలు వెల్లడించాయి.
ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్.. ఫిబ్రవరిలో తాను అమెరికా నుంచి కాడబోమ్స్ ఒకామి అనే కుక్కను 50 కోట్లకు కొన్నానని, అది అరుదైన తోడేలు కుక్కని చెప్పాడు. ఈ జాతి తోడేలు కాకేసియన్ షెపర్డ్ మిశ్రమం అని వెల్లడించాడు. అలాంటి కుక్క భారత్ కు తొలిసారి వచ్చిందన్నాడు. అమెరికాలో జన్మించిన ఈ కుక్క వయస్సు కేవలం 8 నెలలు అని, ఇది ప్రతిరోజూ 3 కిలోల పచ్చి మాంసాన్ని తింటుందన్నాడు. ఈ కుక్కలు చాలా అరుదుగా ఉండటం వల్ల తాను వాటి కోసం డబ్బు ఖర్చు చేస్తానన్నాడు. ప్రజలు వాటిని చూడటానికి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటారు కాబట్టి తనకు తగినంత డబ్బు వస్తుందని వివరించాడు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here