గాలివారి పెళ్లి కంటే ఘనంగా: ఖర్చు రూ.600కోట్లు!

గుర్తుందా? కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో పెళ్లి గురించి అప్పట్లో కథలు కథలుగా చెప్పుకున్నారు. అంత ఖర్చయ్యింది. ఇంత ఖర్చయ్యింది అంటూ.. కూతురు పెళ్లి ఘనంగా చేసిన గాలి జనార్థన్ రెడ్డి అప్పట్లో వార్తల్లో నిలిచారు. ఆ పెళ్లికి రూ. 500కోట్ల వరకు ఖర్చు అయ్యింది అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. 2016లో జరిగిన ఆ పెళ్లి వేడుక ఇప్పటివరకు రికార్డు.
అయితే ఆ రికార్డ్‌ను బీట్ చేస్తున్నారట కర్ణాటక ఆరోగ్యమంత్రి శ్రీరాములు. తన కూతురు రక్షితకు హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన పారిశ్రామికవేత్తల కుటుంబంలో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. మార్చి ఐదవ తేదీన పెళ్లి… అదేరోజు బళ్లారిలో రిసెప్షన్… ఆకాశమంత పందిరి, భూదేవంత పీట టైపులో బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్‌లో 40 ఎకరాల్లో పెళ్లి పనులు చేస్తున్నారు.
ఇప్పటికే పెళ్లి సందడి మొదలైంది. ఫిబ్రవరి 27 నుంచే స్టార్ట్ అవగా.. రకరకాల ఈవెంట్లతో అదిరిపోయేలా ఏర్పాట్లు ప్రోగామ్‌లు చేస్తున్నారు. నాలుగు ఎకరాల స్థలంలో సినిమా సెట్టింగులను తలపించేలా విరూపాక్ష దేవాలయం సెట్.. మెల్కోటే గుడిలోని కళ్యాణి తరహాలో పెళ్లి జరిగే వేదిక సెట్.. సినిమా ప్రముఖుల అట్టహాసం.. పెళ్లి కూతురు మేకప్ కోసం అయితే.. దీపికా పొదుకునేకి మేకప్ చేసే స్టైలిస్ట్‌ని రప్పించారట.
ఇక ఫోటోలు, వీడియోలు అయితే ముఖేష్ అంబానీ కూతురు ఇష్టా అంబానీ పెళ్లికి పనిచేసిన టీం అట. పెళ్లికూతురు పెళ్లి డ్రెస్ అయితే, కన్నడ సినిమా ఇండస్ట్రీలో పేరొందిన కాస్ట్యూమ్ డిజైనర్ సానియా డిజైన్ చేస్తుందట. ఇక భోజనాలన్నీ ఉత్తర కర్నాటక స్టైల్… వెయ్యి మంది వంటవాళ్లు. అతిధుల కోసం అయితే బెంగుళూరులోని దాదాపు అన్ని ఫైవ్ స్టార్ హోటళ్లనూ బుక్ చేసేశారట. మొత్తం పెళ్లి ఖర్చు రూ.600కోట్లు అవుతుందని అంటున్నారు.
9 రోజుల పాటు జరిగే వివాహ వేడుకలు ఘనంగా నిర్వహిస్తుండగా.. ఇవాళ(మార్చి 2) పెళ్లి కుమార్తె బళ్లారి దుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మార్చి 5న జరగనున్న ఈ పెళ్లికి హాజరుకావాలని మంత్రి శ్రీరాములు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పతో పాటు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు అనేక రాజకీయ ప్రముఖులను, కేంద్ర మంత్రులను ఆహ్వానించారు.
(హైదరాబాద్‌లో విషాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబం ఆత్మహత్య)