BJP Foundation Day : కాషాయదళం ప్రస్థానానికి 43 ఏళ్లు, 2 స్థానాల నుంచి 20 రాష్ట్రాల్లో అధికారం వరకు బీజేపీ ప్రస్థానం
తొమ్మిదేళ్లుగా దేశంలో అధికారం. ప్రపంచంలోనే తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన బీజేపీ.. వరల్డ్ వైడ్ నెంబర్ వన్ పార్టీగా ఎదిగిన తీరు..దేశవ్యాప్తంగా 18 కోట్ల సభ్వత్వాలు, 1980 ఏప్రిల్ 6న మాజీ ప్రధాని వాజ్‌పేయి స్థాపించిన బీజేపీ.. 43 ఏళ్లలో దేశమంతా విస్తరించి దేశరాజకీయాలపై తనదైన ముద్ర వేసింది. 300ల మందికి పైగా లోక్‌సభ సభ్యులు, 95 మంది రాజ్యసభ సభ్యులు.. 14 వందల 20 మంది శాసనసభ్యులు.. 165 మంది శాసనమండలి సభ్యులు. 16 రాష్ట్రాల్లో సొంత ప్రభుత్వాలు.. కాషాయదళం ప్రస్థానం

BJP Foundation Day
BJP Foundation Day : మూడు వందల మందికి పైగా లోక్‌సభ సభ్యులు, 95 మంది రాజ్యసభ సభ్యులు.. 14 వందల 20 మంది శాసనసభ్యులు.. 165 మంది శాసనమండలి సభ్యులు. 16 రాష్ట్రాల్లో సొంత ప్రభుత్వాలు. మరో 4 రాష్ట్రాల్లో సంకీర్ణ సర్కారులో భాగస్వామ్యం. ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బలం.. బలగం. 43 ఏళ్ల జైత్రయాత్రలో బీజేపీ.. దేశంలోనే తిరుగులేని శక్తిగా ఎదిగింది. వరల్డ్ వైడ్ నెంబర్ వన్ పార్టీగా ఆవిర్భవించింది. 18 కోట్ల మంది కార్యకర్తలు.. 4 వేల కోట్ల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్‌తో కమలదళం పాన్‌ఇండియా పార్టీగా నిలిచింది.
తొమ్మిదేళ్లుగా దేశంలో అధికారంలో చలాయిస్తున్న బీజేపీ.. ప్రపంచంలోనే తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. దేశవ్యాప్తంగా 18 కోట్ల సభ్వత్వాలతో వరల్డ్‌లోనే అతిపెద్ద పార్టీగా గుర్తింపు సాధించింది బీజేపీ. 1980 ఏప్రిల్ 6న మాజీ ప్రధాని వాజ్‌పేయి స్థాపించిన బీజేపీ.. 43 ఏళ్లలో దేశమంతా విస్తరించి దేశరాజకీయాలపై తనదైన ముద్ర వేసింది. దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాల్లోని 16 చోట్ల కాషాయ పార్టీ ప్రభుత్వాలే ఏలుతున్నాయి. మరో నాలుగు రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిపి బీజేపీ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అంతేకాదు ఈ 43 ఏళ్లలో దేశంలో ఆ పార్టీ అడుగుపెట్టని రాష్ట్రాలు కేవలం మూడే ఉన్నాయి. ఆ మూడింట్లో ఒకటి తెలంగాణ, మిగిలినవి కేరళ, పశ్చిమబెంగాల్. ఈ మూడు రాష్ట్రాలు కాకుండా మిగతా చోట్ల ఎప్పుడో ఒకసారి సొంతంగా అధికారంలోకి రావడమో మిత్రపక్షాలతో కలిసి అధికారాన్ని పంచుకోవడమో జరిగింది. ఏపీ, ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాల్లో టీడీపీ, బిజూ జనతాదళ్, ఆర్‌జేడీ వంటి పార్టీలకు మద్దతు ఇచ్చి ఆ పార్టీ ప్రభుత్వాల్లో అధికారాన్ని అనుభవించింది బీజేపీ. అంతేకాదు బీజేపీ ఎప్పుడూ ప్రాతినిధ్యం వహించని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయదుందుబి మోగించించి. అస్సాం మొదలుకుని మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ, ఆ పార్టీ భాగస్వామ్య పక్షాలే అధికారం చలాయిస్తున్నాయి.
మోదీ బైట్
75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో బీజేపీ ప్రస్థానం 43 ఏళ్లు. కానీ, బీజేపీ మూలాలు 1951 నుంచే దేశ రాజకీయాల్లో కనిపిస్తాయి. శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ నుంచి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ సిద్ధాంత కర్తలు రాజకీయాలు నెరిపారు. భారతీయ జనసంఘ్‌లో యువ నేతలుగా పనిచేసిన మాజీ ప్రధాని వాజ్‌పేయి, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీలు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత భారతీయ జనసంఘ్ జనతా పార్టీగా మారింది. 1977 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇది రెండేళ్లలోనే పడిపోవడం.. జనతాపార్టీ చీలిపోవడంతో 1980 ఏప్రిల్ 6న మాజీ ప్రధాని వాజ్‌పేయి, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ వంటి మహామహుల నేతృత్వంలో బీజేపీ పురుడు పోసుకుంది.
1980లో ఆవిర్భవించిన బీజేపీకి తొలి అధ్యక్షుడిగా వాజ్‌పేయి పనిచేశారు. 1984లో జరిగిన 8వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు సీట్లే దక్కించుకుని ఘోర పరాజయం దక్కించుకుంది. ఈ రెండు సీట్లలో ఎంపీలుగా ఎన్నికైన వారిలో ఒకరు తెలుగువాడైన చందుపట్ల జంగారెడ్డి కాగా, మరొకరు గుజరాత్‌కు చెందిన ఏకే పాటిల్. చందుపట్ల జంగారెడ్డి హన్మకొండ నుంచి ఎంపీగా ఎన్నికై బీజేపీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచారు. ఇలా మొదలైన బీజేపీ ఇప్పుడు దేశంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. వాజ్‌పేయి, అద్వానీ తర్వాత పార్టీ వారసత్వాన్ని అందుకున్న మోదీ, అమిత్‌షా తమ రాజకీయ తంత్రంతో బీజేపీని బలమైన శక్తిగా మార్చేశారు. ఈ నలభై మూడేళ్లలో గత తొమ్మిదేళ్లు బీజేపీ చరిత్రలో సువర్ణాధ్యాయంగా చెప్పొచ్చు.
1980లో పుట్టిన బీజేపీ అధికారం కోసం 1996 వరకు వేచిచూడాల్సివచ్చింది. 16 ఏళ్లపాటు ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. 1992లో అద్వానీ రథయాత్ర బీజేపీ ప్రస్థానంలో ఓ మైలురాయి. ఈ యాత్రతో హిందుత్వ భావజాలాన్ని దేశ వ్యాప్తంగా విస్తరించిన బీజేపీ.. తొలిసారిగా 1996లో 161 మంది ఎంపీల బలంతో మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తొలిసారి అధికారాన్ని చేపట్టింది. కానీ, సభలో తగినంత బలం లేకపోవడంతో 13 రోజులకే ఆ ప్రభుత్వం పతనమైంది. ఆ తర్వాత 1998లో జరిగిన మధ్యాంతర ఎన్నికల్లో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ.. ఈ సారి 13 నెలల పాటు అధికారంలో కొనసాగింది. ఒక్క ఓటు తేడాతో 1999లో ఈ ప్రభుత్వం పతనమై.. ఎన్నికలు జరగ్గా.. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ కూటమి అధికారాన్ని కైవసం చేసుకుని దేశంలో కాంగ్రెసేతర సంకీర్ణ పక్షాన్ని ఐదేళ్లు నడిపి రికార్డు సృష్టించింది. 2004లో అనూహ్యంగా ఓటమి మూటగట్టుకున్నా 2014లో మరోసారి అధికారంలోకి వచ్చింది.
2014లో ప్రధాని మోదీ నాయకత్వంలో రికార్డుస్థాయి మెజార్టీతో సొంతంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ.. అక్కడి నుంచి దేశ వ్యాప్తంగా విస్తరణకు పథకం రచించింది. అంతవరకు కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు.. ముఖ్యంగా హిందీ ప్రాబల్య ప్రాంతానికే పరిమితమైన బీజేపీ.. ఇప్పుడు దేశంలో ఆ చివరి నుంచి చివరి వరకు పాగా వేసి దేశరాజకీయాల్లో బలమైన ముద్ర వేసింది. తూర్పు నుంచి పడమరకు.. ఉత్తర నుంచి దక్షిణకు విస్తరించిన బీజేపీ.. పురాతన కాంగ్రెస్ పార్టీకి.. ప్రాంతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మారింది.
కేవలం రెండు సీట్లతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం ఇప్పుడు 303 మంది లోక్‌సభ సభ్యులతో సంపూర్ణ మెజార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి చేరుకుంది. ఈ స్థాయికి రావడానికి ఎంతోమంది నాయకులు, కార్యకర్తల కృషి ఉంది. మోదీ, అమిత్‌షా నాయకత్వ పటిమే కాదు. సంఘ్ పరివార్ అండదండలు, క్రమశిక్షణగల కార్యకర్తలు బీజేపీని ఉన్నత స్థానంలో నిలిపారు. 18 కోట్ల సభ్వత్వాలతో ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడానికి కారణం బీజేపీ క్రమశిక్షణే, సైద్ధాంతిక దృక్పథమే కారణమని అంటుంటారు విశ్లేషకులు. ప్రపంచంలో చాలా పార్టీలకు రాజకీయ నేపథ్యమే ఉంటుందని.. కానీ, బీజేపీకి రాజకీయంతోపాటు సైద్ధాంతిక సిద్ధాంతాలు ఈ స్థాయికి చేర్చాయని అంటున్నారు.