బెంగాల్ బీజేపీ ఇన్‌ఛార్జికి Z కేటగిరీ సెక్యూరిటీతో పాటు బుల్లెట్ ఫ్రూఫ్ కారు

Kailash Vijayvargiya security బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ, పార్టీ వెస్ట్ బెంగాల్ ఇన్‌ఛార్జి కైలాష్ విజయవర్గియా భద్రతను అప్ గ్రేడ్ చేసింది కేంద్ర హోంశాఖ. డిసెంబర్-10న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటన సందర్భంగా డైమండ్ హార్బర్ కు వెళుతుండగా ఆయన కాన్వాయ్‌లోని కైలాష్ విజయవర్గియా వాహనంతోపాటు మరి కొన్ని వాహనాలపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సోమవారం(డిసెంబర్-14,2020) కైలాష్ విజయవర్గియా భద్రతను పెంచారు. ఆయనకు జెడ్ కేటగిరీ భద్రతతో పాటుగా ఓ బుల్లెట్ ప్రూఫ్ కారుని కేటాయించినట్లు కేంద్ర హోంశాఖ అధికారి తెలిపారు. జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో భాగంగా..22మంది సిబ్బందితో కూడిన CRPF లేదా CISF సెక్యూరిటీని కైలాష్ కలిగి ఉంటారు.
వెస్ట్ బెంగాల్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య రాజకీయ వైరం మరింతగా ముదురుతున్నది. ఎలాగైనా సరే రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అటు అధికారాన్నికాపాడుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) శతవిధాలా ప్రయత్నిస్తోంది.
మరో ఆరు నెలల్లో పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో ప్రచార ఏర్పాట్లపై చర్చించడం కోసం గత వారం రెండు రోజుల పర్యటన కోసం వెస్ట్ బెంగాల్ వెళ్లిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి నిరసన సెగ తగిలిన విషయం తెలిసిందే. నడ్డా కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. నడ్డాతోపాటు పశ్చిమబెంగాల్ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి కైలాష్ విజయవర్గీయ, స్థానిక బీజేపీ నేత ముకుల్ రాయ్ వాహనాలపై కూడా ఆందోళనకారులు రాళ్లు విసిరారు. ఈ దాడిలో విజయవర్గీయతోపాటు పలువురు కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి.
కాగా, పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ హింస, భీభత్సాన్ని నియంత్రించేందుకు కేంద్ర బలగాలను ఇప్పటి నుంచే మోహరించాలని ఎన్నికల కమిషన్(ఈసీ)ను కోరతామని రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జి కైలాష్ విజయవర్గియా తెలిపారు.