Vishnu Dev Sai: ఎట్టకేలకు ఛత్తీస్‌గఢ్ సీఎం ఖరారు అయ్యారు.. ఆ రెండు రాష్ట్రాలకు సీఎంలు ఎప్పుడో?
రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. వారిలో ఎవరిని ఎంపిక చేయాలనే సంకటం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింథియా ఈ వరుసలో ముందున్నప్పటికీ అధిష్టానం ఆవైపు మొగ్గు చూపడం లేదు.

ఎన్నికల ఫలితాలు వచ్చిన 8 రోజులకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఎమ్మెల్యే విష్ణే దేవ్ సాయిని శాసనసభా పక్ష నేతగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఛత్తీస్‌గఢ్ ఏర్పడినప్పటి నుంచి 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రమణ్ సింగ్ కు మళ్లీ అవకాశం దక్కలేదు. అంతకు లోక్‌సభ సభ్యుడిగా ఉన్న విష్ణు దేవ్ ను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపారు. కున్‌కురీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన 25,541 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఎవరనే ప్రశ్న అలాగే మిగింది. కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఎన్నికల హామీలు అమలు చేసే క్రమంలో ఉంది. కానీ బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో మాత్రం ముఖ్యమంత్రి పేర్లే ఖరారు కాలేదు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఏ అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదు. తన కుర్చీని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కాషాయ అధిష్టానం కొత్త వారికి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. వారిలో ఎవరిని ఎంపిక చేయాలనే సంకటం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింథియా ఈ వరుసలో ముందున్నప్పటికీ అధిష్టానం ఆవైపు మొగ్గు చూపడం లేదు. బాబా బాలక్‌నాథ్, అర్జున్ రాం మేఘవాల్, దియా కుమారి వంటి నేతలు కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి 8 రోజులు గడుస్తున్నప్పటికీ.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో పార్టీలో గందరగోళం నెలకొంది.