కర్నాటకలో పవర్ ప్లే : ఢిల్లీ హోటల్ లో బీజేపీ ఎమ్మెల్యేలు

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కర్నాటకలో క్యాంప్ రాజకీయాలు హీట్ రేపుతున్నాయి. సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతోందంటూ బీజేపీ నేతలు చెబుతుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం తమ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదని బయటకు చెబుతూనే రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో ముంబైలోని ఓ హాటల్ లో సమావేశమయ్యారని, వారికి మంత్రి పదవి, డబ్బులు ఇస్తామని ఆశ చూపారని కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ సోమవారం(జనవరి 14,2019) ఉదయం ఆరోపించిన విషయం తెలిసిందే.
ఓ వైపు తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతూనే సంకీర్ణ ప్రభుత్వం బీజేపీ ఎమ్మెల్యేలకు గాలం వేసింది. కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు బహిరంగంగానే తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతున్నారని సోమవారం మధ్యాహ్నాం కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప అన్నారు. సీఎంగా ఉన్న కుమారస్వామి తమ పార్టీకి చెందిన కలబుర్గి ఎమ్మెల్యేకు డబ్బు, మంత్రి పదవి ఆఫర్ చేశారని యడ్యూరప్ప ఆరోపించారు.
ఎన్నికల మందు కాంగ్రెస్ కు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్న బీజేపీ తమ పార్టీకి చెందిన 104మంది ఎమ్మెల్యేలలో 101మందిని ఢిల్లీ శివార్లలోని గురుగావ్ లోని ఓ హోటల్ కి తరలించింది. తమ ఐకమత్యాన్ని చూపించేందుకే ఇదంతా అని యడ్యూరప్ప అన్నారు. మరో రెండు రోజులు తాము ఢిల్లీలోనే ఉంటామని ఆయన తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి అనే విషయంపై చర్చిండానికి తాము గురుగావ్ హోటల్ లో సమావేశమైనట్లు బీజేపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.మరోవైపు హోటల్ లోని బీజేపీ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని బీజేపీ చీఫ్ అమిత్ షా హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ ని కోరారు.