వెస్ట్ బెంగాల్‌లో ఎన్నికల ఫీవర్ : BJP రెండంకెల స్థానాలు సాధించదన్న పీకే

వెస్ట్ బెంగాల్‌లో ఎన్నికల ఫీవర్ : BJP రెండంకెల స్థానాలు సాధించదన్న పీకే

Updated On : December 21, 2020 / 12:53 PM IST

BJP will struggle to CROSS DOUBLE DIGIT in West Bengal : వెస్ట్ బెంగాల్‌లో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటి నుంచే అక్కడ ఎన్నికల హీట్ నెలకొంది. ప్రధానంగా ఇక్కడ పాగా వేయాలని బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఈ పార్టీకి చెందిన అగ్రనేతలు తరచూ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మమత కోటను కూల్చేందుకు బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. మొన్న కేంద్ర మంత్రి అమిత్ షా జరిపిన పర్యటనలో పలువురు నేతలు బీజేపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే..తృణముల్ కాంగ్రెస్ పార్టీ (TMC government), మమత బెనర్జీ (Mamata Banerjee)కి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 2020, డిసెంబర్ 21వ తేదీ సోమవారం ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ (tweet) చేశారాయన. వెస్ట్ బెంగాల్‌లో బీజేపీకి హైప్ లేదని, కేవలం మీడియా సృష్టేనని, రెండంకెల స్థానాలు (double digits) సాధించదని కొట్టిపారేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను చేసిన ట్వీట్‌ను సేవ్ చేసుకుని ఉంచుకోవాలని, తాను చెప్పిన విషయం నిజమౌతుందని, బీజేపీ నిజంగా వండర్ క్రియేట్ చేస్తే..తాను పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా రాణిస్తున్న రంగాన్ని వీడుతానని పీకే సవాల్ చేయడం విశేషం. దీనికి వెంటనే బీజేపీ రియాక్ట్ అయ్యింది. బెంగాల్‌లో సునామీ సృష్టించబోతున్నామని బీజేపీ నేత కైలాశ్ వ్యాఖ్యానించారు.

వచ్చే ఏడాది ఈ రాష్ట్రంలో అసెంబ్లీ జరుగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ (BJP) నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. దీంతో టీఎంసీలో కాస్త కలవరం మొదలైంది. టీఎంసీ లీడర్ సువేందు అధికారితో పాటు పలువురు కీలక లీడర్స్ కాషాయ కండువా కప్పుకున్నారు. టీఎంసీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పడిపోతున్న డ్యామెజ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రశాంత్ కిశోర్ స్వయంగా రంగంలోకి దిగారు. పలు పార్టీలకు వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేశారు. ఏపీలో వైసీపీని అధికారంలోకి తీసుకరావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.