Bihar Politics : జేడీయూతో దోస్తీ వద్దన్న బీజేపీ ఇప్పుడెందుకు రాజీపడినట్టు..? కమలం వ్యూహాం ఇదేనా?

Bihar Politics : ఇండియా కూటమి తమకసలు పోటీదారు కానేకాదన్న సందేశాన్ని.. బీహార్ పరిణామాల ద్వారా దేశప్రజలకు ఇవ్వాలనుకుంటోందా..? అసలు ఇండియా కూటమిలో పార్టీలు కలిసి పనిచేయడం సాధ్యమేనా..?

Bihar Politics : జేడీయూతో దోస్తీ వద్దన్న బీజేపీ ఇప్పుడెందుకు రాజీపడినట్టు..? కమలం వ్యూహాం ఇదేనా?

BJP’s repeated embrace of Nitish strategy to cover its flanks on the Lok Sabha battlefield

Bihar Politics : జేడీయూకు శాశ్వతంగా తలుపులు మూసేశామని గతంలో చెప్పిన బీజేపీ ఇప్పుడెందుకు రాజీపడింది..? జేడీయూను అడ్డుపెట్టుకుని….మొత్తం ఇండియా కూటమినే ఉనికిలో లేకుండా చేయడమే కమలనాథులు ఉద్దేశమా..? ఇండియా కూటమి సమావేశం తర్వాత ఇండియా పేరునే భారత్‌గా మార్చుతూ నిర్ణయం తీసుకునేంతలా ఉలిక్కిపడిన NDA ప్రభుత్వం.. ఇండియా కూటమి తమకసలు పోటీదారు కానేకాదన్న సందేశాన్ని.. బీహార్ పరిణామాల ద్వారా దేశప్రజలకు ఇవ్వాలనుకుంటోందా..? అసలు ఇండియా కూటమిలో పార్టీలు కలిసి పనిచేయడం సాధ్యమేనా..?

Read Also : JDU INDIA Alliance : ఇండియా కూటమితో జేడీయూ ఎందుకు తప్పుకుందంటే? అసలు కారణం ఇదేనంటున్న పార్టీ సీనియర్ నేత

2020 బీహార్ ఎన్నికల్లో జేడీయూ మూడోస్థానానికే పరిమితమైనప్పటికీ…నితీశ్‌కుమార్‌కే సీఎం పదవి అప్పగించింది బీజేపీ. ఎక్కువమంది ఎమ్మెల్యేలున్న పార్టీ..అతి తక్కువమంది ఎమ్మెల్యేలున్న పార్టీకి మద్దతిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయినా సరే నితీశ్‌కుమార్‌కు సంతృప్తి కలగలేదు. అమిత్ షా జోక్యం చేసుకుంటున్నారని, బీజేపీ మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తూ…NDA కూటమికి దూరమై..ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ప్రతిపక్షాలు ఐక్యంగా కలిసి పనిచేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పుడు..ఇండియా కూటమిని దగ్గరుండి నడిపించారు. అన్నీతానై అన్నట్టుగా వ్యవహరించారు.

నితీష్ లాంటి నేతలతో కాంగ్రెస్‌కు కొత్త పాఠాలు :
నితీశ్ కాంగ్రెస్‌కు దగ్గరైనప్పుడు.. ఇండియా కూటమిలో కీలకపాత్ర పోషిస్తున్నప్పుడు..ఆయన్ను గమనిస్తే…కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే పరమావధిగా పనిచేస్తున్నట్టు అందరికీ అనిపించింది. ఇక లోక్‌సభ ఎన్నికల వరకూ ఇవే రాజకీయ పరిస్థితులు కొనసాగుతాయన్న అభిప్రాయం కలిగింది. కానీ నితీశ్‌.. తానెంతో అవకాశవాదో మరోసారి నిరూపించుకున్నారు. అలాగే నితీశ్‌నే కాదు..మమత, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలను నమ్మడం ఎంత తెలివితక్కువపనో కాంగ్రెస్‌కూ అర్ధమయింది. కాంగ్రెస్ కొత్త పాఠాలు నేర్చుకున్నట్టయింది. వారే కాదు..కూటమిలోని మిగిలిన పార్టీల నేతల వ్యవహారశైలీ ఇందుకు భిన్నంగా ఏమీ ఉండదు.

ఎన్డీఏకు నితీశ్ దూరమైంది ఇందుకేనా? :
నితీశ్‌నే గమనిస్తే….ఆయనకు దేశప్రధాని కావాలన్న బలమైన ఆకాంక్ష ఉంది. అసలు 2013లో నితీశ్ NDAకి దూరం జరగడానికి కారణం.. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీని ప్రకటించడమే. ఆ తర్వాత కాలంలో తప్పని పరిస్థితుల్లో రాజీపడ్డారు. 2022లో మళ్లీ ఏవో కారణాలు చెప్పి..బీజేపీకి దూరం జరిగి కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. NDAని ఢీకొట్టేందుకు ఇండియా కూటమి ఏర్పాటులో ముందున్నారు. అయితే ఆయన మనసులో ఉద్దేశం…INDIA కూటమి ప్రధాని అభ్యర్థిగా తనను నిలబెట్టాలని. మోదీకి ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమి దేశ ప్రజల ముందు తనను ఉంచాలని. ఈ క్రమంలో ఆయనో పాచిక కూడా వేశారు. బహిరంగంగా ఎవరూ అంగీకరించకపోయినప్పటికీ…ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే…ప్రధాని అయ్యేది రాహుల్ గాంధీనే. కూటమి అధికారంలోకి వస్తే.. అప్పుడు మిగిలినపార్టీలన్నీ రాహుల్‌ను ప్రధానిగా అంగీకరించకతప్పని పరిస్థితి ఉంటుంది.

నితీష్‌‌కు పోటీగా మమతాబెనర్జీ పేరు తెరపైకి :
అందుకే వ్యూహాత్మకంగా నితీశ్ ఓ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. కూటమి కన్వీనర్‌గా AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును తెరపైకి తెచ్చారు. అలా రాహుల్‌ను రేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. కన్వీనర్‌గా ఉండేందుకు ఖర్గే నిరాకరించడంతో నితీశ్‌కుమార్ పేరు తెరపైకి వచ్చింది. కూటమిలోని మిగిలిన నేతలు కూడా నితీశ్‌ పేరును అంగీకరించారు. ఇక్కడే రాహుల్ తెలివిగా వ్యవహరించారు. మమతాబెనర్జీ పేరును ఆయన ప్రతిపాదించారు. ఇది నితీశ్‌కు ఆగ్రహం తెప్పించింది. తాననుకన్నది జరగకపోవడం, జరిగే అవకాశాలు లేకపోవడం, అసలు ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేకపోవడం వంటివన్నీ నితీశ్‌ను వేగంగా నిర్ణయం తీసుకునేలా చేశాయి.

అప్పట్లో బీజేపీ ఆగ్రహానికి కారణం ఏంటి?  :
అయితే ఇండియా కూటమి కకావికలమైపోతుందన్న భావన కల్పించడంలో బీజేపీ పాత్ర తక్కువేమీ కాదు. నితీశ్‌కుమార్ విషయంలో బీజేపీ వ్యవహారశైలి గమనిస్తే… ఈ విషయం అర్ధమవుతుంది. తక్కువస్థానాలున్నప్పటికీ సీఎం పదవి అప్పగించారన్న కృతజ్ఞత చూపకుండా…NDA కూటమికి నితీశ్ దూరం జరగడం అప్పట్లో బీజేపీకి ఆగ్రహం తెప్పించింది. NDA తలుపులు జేడీయూకు శాశ్వతంగా మూసుకుపోయాయి అంటూ అమిత్ షా వంటి నేతలు గంభీరమైన ప్రకటనలూ చేశారు. కానీ అలాంటి నితీశ్‌కుమార్‌ను బీజేపీ మళ్లీ అక్కన చేర్చుకోడానికి కారణం..ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయడానికే. 40 అసెంబ్లీస్థానాలున్న బీహార్‌లాంటి పెద్దరాష్ట్రంలో కూటమిని దెబ్బతీయడం ద్వారా మిగిలిన రాష్ట్రాల్లోనూ చెక్‌పెట్టాలన్నది కమలనాథుల ఆలోచన.

కమలం వ్యూహం ఇదే :
కూటమికి ఇండియా అని ప్రతిపక్షాలు పేరు పెట్టుకున్నప్పుడు.. దేశం పేరునే ఇండియా నుంచి భారత్‌గా మోదీ ప్రభుత్వం మార్చడాన్ని గమనిస్తే.. ప్రతిపక్ష కూటమిని బీజేపీ…అంత తేలిగ్గా చూడడం లేదన్న సంగతి అర్ధమవుతుంది. మోదీ మ్యానియాతో జోరుమీద ఉన్నప్పటికీ…అయోధ్య ఆలయం మరింత ఊపుతెచ్చినప్పటికీ.. కాంగ్రెస్‌కు ఏ చిన్న అవకాశం ఇచ్చేందుకూ బీజేపీ సిద్ధంగా లేదు. ఇండియా కూటమిని మూణ్ణాళ్ల ముచ్చటగా మార్చడం ద్వారా…బీజేపీ గెలుపును నల్లేరుమీద నడకలా మార్చేయాలన్నది కమలం వ్యూహం. బీజేపీ ఆలోచనలకు తగ్గట్టుగానే ఉన్న ఇండియా కూటమి భాగస్వాముల విచ్ఛిన్న వైఖరి వచ్చే ఎన్నికల్లో కమలంపార్టీని తిరుగులేని శక్తిగా మార్చేలా ఉంది.

రాజకీయాల్లో ఆత్మహత్యలేకాని, హత్యలు ఉండవంటుంటారు. ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు అనుసరిస్తున్న ఆత్మహత్యా సదృశ వైఖరి చూస్తే.. ఈ నానుడి నిజమేనని మరోసారి రుజువవుతోంది. ఇదంతా చూస్తే.. కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో జాతీయస్థాయిలో మరోసారి తీవ్ర నిరాశే ఎదురయ్యేలా ఉంది.

Read Also : Nitish Kumar Bihar Politics : నితీశ్ వ్యవహారం.. మొత్తం ఇండియా కూటమిపైనే ప్రభావం.. వచ్చే ఎన్నికల్లో బీహార్ ప్రజలు ఎటు మొగ్గుచూపుతారో..?!