ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం.. హత్యచేసి బాడీని ట్రాలీ బ్యాగులో పెట్టి ఐస్‌క్రీం ఫ్రీజర్‌లో భద్రపర్చారు.. మూడ్రోజుల తరువాత..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రఘువంశీ హత్య కేసు మరవకముందే త్రిపురలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది..

Tripura
Tripura: దేశవ్యాప్తంగా రఘువంశీ హత్య కేసు సంచలనం సృష్టించింది. పెళ్లిచేసుకున్న నూతన జంట హనీమూన్‌కు వెళ్లగా.. కట్టుకున్న భార్యే తన ప్రియుడితో కలిసి రఘువంశీని హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలడం సంచలనంగా మారింది. ఇదే సమయంలో త్రిపురలో ఓ దారుణ ఘటన చోటు వెలుగులోకి వచ్చింది. త్రిపుర రాజధాని నుంచి 120 కిలో మీటర్ల దూరంలో ఉన్న ధలై జిల్లాలోని గండచెర ప్రాంతంలో బుధవారం ఒక యువకుడి మృతదేహాన్ని ఐస్ క్రీం ఫ్రీజర్ లో పోలీసులు గుర్తించారు.
జూన్ 8వ తేదీన అగర్తలాలో యువకుడిని హత్యచేసి, ఆ తరువాత మృతదేహాన్ని ట్రాలీ బ్యాగులో భద్రపర్చి.. ఫ్రీజర్ లో దాచిపెట్టారు. యువకుడు మిస్సింగ్ ఫిర్యాదు రావడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం మృతదేహాన్ని గుర్తించారు.. యువకుడి హత్యకు గల కారణాలను వెల్లడించారు.
మృతుడు 24ఏళ్ల సరిఫుల్ ఇస్లాంగా పోలీసులు గుర్తించారు. అతడు అగర్తల స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. త్రికోణ ప్రేమ కారణంగా ఇస్లాం హత్యకు గురయ్యాడని పశ్చిమ త్రిపుర ఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు.
ఇస్లాం 20ఏళ్ల అమ్మాయితో ప్రేమవ్యవహారం కొనసాగిస్తున్నాడు. ఆ అమ్మాయి బంధువు దివాకర్ కూడా ఆమెను ప్రేమిస్తున్నాడు. ఇటీవల ఇస్లాం, యువతి గొడవపడ్డారు. కొన్నిరోజులుగా మాట్లాడుకోవటంలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న దివాకర్ ఆ యువకుడిని హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు.
జూన్ 8వ తేదీ రాత్రి నిందితుడు డాక్టర్ దివాకర్ సాహా (29) ఇస్లాంను అగర్తలలోని ఇందిరానగర్‌లోని తన ఇంటికి పిలిచాడు. దివాకర్ ముగ్గురు స్నేహితులు అనిమేష్ యాదవ్ (21), నబనిత్ దాస్ (25), జయదీప్ దాస్ (20) అప్పటికే అక్కడే ఉన్నారు. నలుగురు ఇస్లాం గొంతు కోసి చంపి, ఆపై మృతదేహాన్ని ట్రాలీ బ్యాగులో భద్రపర్చారు. జూన్ 9న దివాకర్ తల్లిదండ్రులు దీపక్ సాహా, దేబికా సాహా గండచెరా నుంచి అగర్తలా చేరుకున్నారు. వారు బ్యాగ్ ను గండచెరాకు తీసుకెళ్లి మృతదేహాన్ని తమ దుకాణంలోని ఐస్ క్రీం ఫీజర్ లో దాచిపెట్టారు.
సరీఫుల్ ఇస్లాం కనిపించక పోవటంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. చివరిసారిగా దివాకర్ ఇంటికి ఇస్లాం వెళ్లినట్లు గుర్తించారు. దివాకర్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నేరం అంగీకరించాడు. మృతదేహాన్ని ఐస్ క్రీం ఫీజర్ లో ఉంచినట్లు చెప్పాడు. దీంతో ప్రధాన నిందితుడు దివాకర్ తో పాటు అతని ముగ్గురు స్నేహితులు, అతని తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు.