COVID-19 శవాన్ని సమాధి చేస్తారా.. దహనం చేస్తారా.. ఏది సేఫ్?

COVID-19 శవాన్ని సమాధి చేస్తారా.. దహనం చేస్తారా.. ఏది సేఫ్?

Updated On : April 18, 2020 / 5:24 AM IST

మనిషి బతికి ఉండగానే కరోనా వైరస్ సోకితే 3 మీటర్ల దూరం పాటిస్తూ ఉండాలని.. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ మాస్క్ లు, శానిటైజర్లు వాడాలని చెప్తున్నారు. మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో భాగమవుతున్నాం. మరి వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి పరిస్థితి ఏంటి..? మనిషి చచ్చిపోయాక వైరస్ చచ్చిపోతుందా.. ఆ COVID-19 మృతుడి అంత్యక్రియలు ఎలా జరుగుతాయి. దహనం చేస్తారా.. సమాధి చేస్తారా.. మతధర్మాన్ని అనుసరించి అంతిమ యాత్ర చేసుకోవచ్చా.. వీటి గురించి తెలుసుకుందాం.

ప్రపంచానికి ఈ భూతాన్ని పరిచయం చేసిన చైనాతో పాటు శ్రీలంక, ఇండియాల్లోనూ ఇదే సందేహం. వివాదాలతో కూడిన చర్చలు. జనాభాలో మెజార్టీ భాగం శవాలను పాతిపెడుతున్నారు. దీనికి World Health Organisation (WHO)సైతం వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. ఆఫ్రికాను వణికించిన ఎబోలా సమయంలోనూ ఇదే పద్ధతి అవలంభించారు. చాలావరకూ పాతిపెట్టే అంత్యక్రియలను పూర్తి చేశారు. 

కారణం  COVID-19 అనేది ఒక మనిషిలోని ద్రావణాల తుంపర్ల నుంచి వేరొకరికి వ్యాప్తి చెందుతుంది. అంటే మానవ శరీరం ఆ ద్రావణాన్ని విడుదల చేసేలా ఉండాలి. ఇక పోతే సమాధి అయిన శరీరం 7నుంచి 10రోజుల్లో కుళ్లిపోతుంది. శరీరంలో కేవలం 3నుంచి 4రోజుల వరకూ మాత్రమే ద్రావణాల నిల్వ ఉంటుంది. దీనిని బట్టి చూస్తే కరోనా వైరస్ సమాధి చేయడానికి శవాన్ని సిద్ధం చేస్తున్నప్పుడు వ్యాప్తి చెందాలి. లేదంటే 3 నుంచి 4రోజుల్లో సమాధిని తిరిగి తవ్వితే వైరస్ అంటుకునే ప్రమాదం ఉంది. కానీ, దహనం విషయంలో ఇలాంటివేమీ ఉండవు. బూడిదకు ఎటువంటి వైరస్ ఉండే అవకాశాల్లేవు. 

చైనాలో డిసెంబరు నుంచి రెచ్చిపోతున్న కరోనా వైరస్ పై ఒక నిర్ణయానికి వచ్చారు. శవాలను దహనం చేసేయాలని ఫిక్సయ్యారు. చాలా కేసుల్లో కుటుంబ సభ్యులు హాజరుకాకపోయినా మరణించిన వెంటనే దహనం చేసేశారు. మతపరమైన ప్రాధాన్యతలను పక్కకు పెట్టి వైరస్ ను అంతం చేయాలని కాల్చేశారు. వీటిపై చైనా అధికారుల్లో కొన్ని  అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సమాధి కట్టడానికి బదులు దహనం చేయడంపై ప్రశ్నలు మొదలయ్యాయి. వాటన్నిటిని పక్కకుపెడుతూ ఫిబ్రవరి 2న చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెంటనే దహనం చేయాలని ఆదేశాలిచ్చింది. 

భారతదేశంలో ఇక్కడా మత స్వేచ్ఛకు భంగం కలగనివ్వలేదు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాధులకు, దహనాలకు అడ్డు చెప్పలేదు. వారికి ఇష్టమైన తీరులో అంత్యక్రియలు పూర్తి చేయడానికి అంగీకారం తెలిపింది. కానీ, ఆ కార్యం జరిగేటప్పుడు హెల్త్ ప్రొఫెషనల్ దగ్గరే ఉంటారు. పూర్తి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (PPE)ధరించి పూర్తి చేయాలి. (రంజాన్‌పై కరోనా ఎఫెక్ట్ : ఇంట్లోనే ప్రార్థనలు)

శవాన్ని లీక్ ప్రూఫ్ ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచుతారు. సంచిలో ఒక శాతం హైపో క్లోరైడ్ ద్రావణం పోస్తారు. ఆ ప్లాస్టిక్ సంచిని ర్యాప్‌తో చుడతారు. మృతుడి మొహం చూసేందుకు జిప్ ఓపెన్ చేసుకోవచ్చు. ముక్కు, నోరులో నుంచి లిక్విడ్ బయటకు రాకుండా ప్లగ్ తో మూసేస్తారు. శవానికి స్నానం గానీ, ముద్దులు గానీ, కౌగిలించుకోవడం గానీ చేయకూడదు. కుటుంబ సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో హాజరుకాకూడదు. మతపరమైన ప్రార్థనలకు అనుమతి ఉంది. ధార్మికమైన నీటిని శవంపై చల్లుకునే అవకాశం ఉంది. 

శ్రీలంకలో మాత్రం కరోనా వైరస్ తో చనిపోయినా.. చనిపోయిన వ్యక్తికి COVID-19 వైరస్ ఉందనే అనుమానం ఉన్నా కచ్చితంగా దహనం చేయాలని శ్రీలంక ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రత్యేకించి ముస్లింల కోసమే. నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వైరస్ తో పోరాడేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంది.