మహిళల ఆరోగ్యం కోసం : రూపాయికే శానిటరీ నాప్‌కిన్

దేశంలోని మహిళలు, యువతులు ఆరోగ్యంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం జనఔషధి దుకాణాల్లో రూ.2.50 అమ్ముతున్న ఒక్కో శానిటరీ నాప్‌కిన్ ధరను తగ్గించాలని నిర్ణయించింది. ఒక్క రూపాయికే అందించాలని నిర్ణయించింది. ఇది మంగళవారం (ఆగస్టు 27) నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించారు కేంద్ర రసాయన, ఎరువులశాఖ సహాయమంత్రి మన్‌సుఖ్ మాండవీయ. సువిధ పేరుతో ఇప్పటివరకు నాలుగు నాప్‌కిన్లు ఉన్న ప్యాకెట్‌ను జనఔషధి షాపుల్లో 10 రూపాయలకు అమ్మేవారు. తగ్గించిన ధరతో ఈ ప్యాకెట్ ఇక నుంచి కేవలం 4 రూపాయలకే లభించనుంది. సువిధ బ్రాండ్ పేరుతో ఈ నాప్‌కిన్లు దేశవ్యాప్తంగా 5వేల 500 జన్ ఔషధి దుకాణాల్లో లభించనున్నాయి.
ఈ నాప్ కిన్లు అవసరానికి తగిన డిమాండ్ మేరకే తయారు చేసి సరఫరా చేస్తున్నారు. రిటైల్ ధరను తగ్గించేందుకు కేంద్రం తయారీ దారులకు సబ్సిడీ ఇస్తుంది. ఈ సబ్సిడీ శానిటరీ ప్యాడ్లను సరఫరా పక్కదారి పట్టకుండా చేసేందుకు కేంద్రం పటిష్టమైన చర్యలు తీసుకుందని మంత్రి మాండవీయ తెలిపారు. ఈ కొత్త నాప్‌కిన్లు పర్యావరణ హితమైనవని.. వాడి పడేశాక భూమిలో త్వరగా కలిసిపోతాయని మంత్రి తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు ప్యాడ్లను తక్కువ ధరకే అందిస్తామని కేంద్రం గత ఏడాది మార్చిలో ప్రకటించింది. రెండు నెలల అనంతరం మేలో జన్‌ఔషధి కేంద్రా ల్లో అందుబాటులోకి వచ్చాయి. సంవత్సరకాలంలో జన్ ఔషదీ కేంద్రాల్లో 2.2 కోట్ల నాప్‌కిన్ల అమ్మకాలు జరిగాయని తెలిపారు. ఈ క్రమంలో రేటు మరింతగా తగ్గించటంతో అమ్మకాలు మరింతగా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.