పేదలపై పోలీస్ క్రూరత్వం..గ్రామ మార్కెట్ లోని కూరగాయలను పోలీస్ జీపుతో తొక్కించాడు

  • Published By: venkaiahnaidu ,Published On : June 5, 2020 / 04:19 PM IST
పేదలపై పోలీస్ క్రూరత్వం..గ్రామ మార్కెట్ లోని  కూరగాయలను పోలీస్ జీపుతో తొక్కించాడు

Updated On : June 5, 2020 / 4:19 PM IST

ఓ గ్రామంలోని కూరగాయ మార్కెట్లో ఓ యూపీ పోలీసు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రయాగ్ రాజ్ జిల్లాలోని ఓ గ్రామీణ ప్రాంతంలో నేల మీద ఉన్న కూరగాయలను పోలీస్ జీపుతో తొక్కించి నాశనం చేసిన ఆ పోలీస్ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకి ఆ పోలీస్ అధికారిని అధికారులు సస్పెండ్ చేయడమే గాక,అతడిని జిల్లా నుంచి మరొక చోటుకి ట్రాన్స్ ఫర్ చేశారు.
అసలు ఏం జరిగింది?
ప్రయాగ్ రాజ్ జిల్లాలోని గోర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలోని మార్కెట్ దగ్గర రోడ్లపైనే కొందరు కూరగాయలు,ఫ్రూట్స్ అమ్ముకుంటున్నారు.  ఈ సమయంలో అక్కడికి ఓ పోలీస్ వాహనం వచ్చింది. వేగంగా సైరెన్ మోగిస్తూ పోలీస్ జీపు మార్కెట్ దగ్గరకు చేరుకుంది. వెంటనే అక్కడ నేలపై అమ్మకానికి ఉంచిన కూరగాయలపైకి పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ వాహనం పోనిచ్చాడు. అక్కడున్నవాళ్లు బ్రతిమాలినా వినకుండా కూరగాలపైకి జీపుని పోనిచ్చాడు.

అక్కడున్న కూరగాయలు,ఫ్రూట్స్ ను తన పోలీస్ జీపుతో తొక్కించి రాక్షస ఆనందం పొందాడు. అంతేకాకుండా, జీపు చక్రాల కింద నలగకుండా ఉన్న కూరగాయల కోసం… ఒకటికి రెండు సార్లు బండిని రివర్స్ తీసుకెళ్లి..మళ్లీ ముందుకొచ్చిచక్రాల కింద వాటిని తొక్కేశాడు. కూరగాయలు జీపు కింద పడకుండా అక్కడున్నవాళ్లు జీపుకి అడ్డుపడే ప్రయత్నం చేశారు. అయితే జనం ఎక్కువగా ఉన్న అక్కడే వేగంగా జీపుని పోనిచ్చి కూరగాయలు,ఫ్రూట్స్ ను నాశనం చేశాడు.

మండిలో సోషల్ డిస్టెన్స్ పాటించలేదని, ఎన్నిసార్లు చెప్పినా వినలేదని అందుకే పోలీసులు అలా చేశారని పోలీసు వర్గాల నుంచి వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సదరు పోలీస్ అధికారిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో చాలామంది తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలాంటి క్రూరమైన చర్యలేంటి అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.