Parliament Winter Sessions : కేంద్రం అఖిలపక్ష సమావేశం.. పార్లమెంట్ సమావేశాల్లో 24 బిల్లులు ఆమోదానికి కసరత్తు

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన క్యాష్ ఫర్ క్వరీ ఆరోపణలపై లోక్‌సభ ముందుకి ఎథిక్స్ కమిటీ నివేదిక రానుంది. మొహువా మొయిత్రా పై అనర్హత వేటు వేయాలని ..

Parliament Winter Sessions : కేంద్రం అఖిలపక్ష సమావేశం.. పార్లమెంట్ సమావేశాల్లో 24 బిల్లులు ఆమోదానికి కసరత్తు

Parliament Winter Sessions

Parliament Sessions : డిసెంబర్ 4 నుంచి 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. 19రోజుల్లో 15 సిట్టింగుల్లో పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల నేపథ్యంలో శనివారం కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఇవాళ ఉదయం 11గంటలకు పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఈ అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రహ్లాద్ జోషి, రాజ్ నాథ్ సింగ్, పీయూష్ గోయల్ సహా వివిధ పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు పాల్గోనున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన పలు కీలక బిల్లులను పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ బిల్లులపై అఖిల పక్షం సమావేశం దృష్టికి తీసుకెళ్లనున్నారు.

Also Read : Chandrababu Naidu : ఈనెల 10 నుంచి చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన.. ఏరోజు ఏ జిల్లాల్లో పర్యటిస్తారంటే..

ప్రభుత్వానికి సంబంధించిన పలు కీలక బిల్లులను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. మొత్తం 24 బిల్లులను సభముందుకు తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు ఏడు కొత్త బిల్లులను శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంతేకాక, ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌లను ఆమోదానికి పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ మూడు బిల్లులపై ఇప్పటికే చర్చించి స్పీకర్ కు హోం శాఖ స్థాయి సంఘం నివేదికను సమర్పించింది.

Also Read : Pawan Kalyan : వైసీపీలోకి వెళ్లిపోండి.. జనసేన నాయకులపై పవన్ కల్యాణ్ ఫైర్

ముగ్గురు ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లు కూడా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం సభ ముందుకు తీసుకొచ్చే యోచనలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన క్యాష్ ఫర్ క్వరీ ఆరోపణలపై లోక్‌సభ ముందుకి ఎథిక్స్ కమిటీ నివేదిక రానుంది. మొహువా మొయిత్రా పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఎథిక్స్ కమిటీ నివేదించింది. లోక్ సభలో ఎథిక్స్ కమిటీ నివేదికపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. రేపు తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో, ఎల్లుండి మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలు పార్లమెంట్ శీతాకాల సమావేశాల పై ప్రభావం చూపనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఒక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.