Chandrababu Naidu : ఈనెల 10 నుంచి చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన.. ఏరోజు ఏ జిల్లాల్లో పర్యటిస్తారంటే..

రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల సందర్శన పూర్తయిన తరువాత పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో చంద్రబాబు నిమగ్నం కానున్నారు. ఈ క్రమంలో ఈనెల 10 నుంచి ..

Chandrababu Naidu : ఈనెల 10 నుంచి చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన.. ఏరోజు ఏ జిల్లాల్లో పర్యటిస్తారంటే..

Chandrababu Naidu

AP TDP : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్లనున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టయిన చంద్రబాబు సుమారు రెండు నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. గతనెల ఆయన బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. బెయిల్ పై బయటకువ చ్చిన తరువాత తొలిసారి శుక్రవారం తిరుమల శ్రీవారిని చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి దర్శించుకున్నారు. అక్కడి నుంచి అమరావతి చేరుకున్నారు. శనివారం ఉదయం 10గంటలకు విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని చంద్రబాబు సతీసమేతంగా దర్శనం చేసుకుంటున్నారు. వచ్చే వారంరోజుల పాటు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను చంద్రబాబు సందర్శించి, ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఇవాళ దుర్గమ్మ దర్శనం అనంతరం సాయంత్రం విశాఖపట్టణం వెళ్తారు. రేపు సింహాచలం అప్పన్నను దర్శించుకుంటారు. ఈనెల 5న శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటారు. అనంతరం కడప దర్గా, గుణదల మేరీమాత ఆలయానికి చంద్రబాబు వెళ్లనున్నారు.

Also Read : మిజోరం ఓట్ల లెక్కింపు తేదీ మార్పు.. కృష్ణా జలాల పంచాయితీపై కేంద్రం జోక్యం

రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల సందర్శన పూర్తయిన తరువాత పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో చంద్రబాబు నిమగ్నం కానున్నారు. ఈ క్రమంలో ఈనెల 10 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థను జగన్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం, సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేయడంపై రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్, ఏపీ సర్పంచ్‌ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సమావేశాలు ఈనెల 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడప జిల్లాల్లో జరగనున్నాయి. పార్టీలకు అతీతంగా సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను సమావేశాలకు ఆహ్వానించనున్నారు. ఒక్కో సమావేశానికి సుమారు ఐదారు వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

Also Read : వైసీపీలోకి వెళ్లిపోండి.. జనసేన నాయకులపై పవన్ కల్యాణ్ ఫైర్

మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఢిల్లీ వెళ్లి సీఈసీని కలవాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఓటమి భయంతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దొంగ ఓట్లు చేర్పించటం, తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తీసేయటం వంటి చర్యలకు పాల్పడుతున్నాడని సీఈసీ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్తారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలోనే డిల్లీ వెళ్లేలా చంద్రబాబు నిర్ణయించారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ లోపు తనకు సమయం కేటాయించాలంటూ సీఈసీకి చంద్రబాబు లేఖ రాయనున్నారు.

శుక్రవారం తెలంగాణ ఎన్నికలపై తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చజరిగింది. ఈ సమావేశంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నేతలు విశ్లేషించారు. మరోవైపు కృష్ణా నదీజలాల కేంద్రం పునః సమీక్ష నిర్ణయంపై నోరు తెరవని జగన్ తెలంగాణ ఎన్నికలరోజు పోలీసులతో హడావుడి చేయించడం ఏంటని సమావేశంలో చంద్రబాబు పేర్కొన్నారు. స్వార్ధ ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాల కోసంతప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏనాడూ జగన్ కాపాడలేదని చంద్రబాబు అన్నారు. సాగర్ డ్యాం వద్ద ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టించటం తప్ప వైసీపీ ప్రభుత్వం సాధించేది ఏమిటని నిలదీశారు. నీటి వినియోగంపై కనీస అవగాహనలేని వాళ్లు పాలకులు కావటంతో అనేక అనర్థాలు జరుగుతున్నాయని, కుటిల రాజకీయాలతో రాష్ట్రం పరువు తీస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఐపీఎస్ వ్యవస్థ ఒకలా పని చేస్తుంటే, అందుకు విరుద్ధంగా జగన్ దుర్వినియోగం చేస్తున్నాడని చంద్రబాబు ధ్వజమెత్తారు.