Dail 112 : అత్యవసర నెంబర్ డయల్ 100 కాదు.. ఇకపై 112
దేశ వ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నెంబర్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 112 నెంబర్ ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న డయల్ 100 స్థానంలో దీనిని తీసుకొచ్చారు. దీనిపై ప్రచారం కల్పించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ అవగాహన కల్పించేందుకు సిద్దమైంది

Dail 112
Dail 112 : అత్యవసర సమయంలో ప్రజలు కాల్ చేసే డయల్ 100 నెంబర్ మారనుంది.. దీని స్థానంలో 112 నంబర్ ను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అమెరికా తరహాలోనే ఈ విధానాన్ని తీసుకొచ్చింది. దేశంలో ఒక అత్యవసర నెంబర్ మాత్రమే ఉండాలని రెండేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎమర్జెన్సీ నెంబర్ గా 112 ని ఫైనల్ చేసింది. ఈ మేరకు ఈ ఏడాది ప్రారంభంలో 112 నెంబర్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. ఇక 112 నెంబర్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.
మరో రెండు నెలల వరకు పాత నెంబరే
ఇక మరో రెండు నెలల వరకు డయల్ 100 అందుబాటులో ఉండనుంది. డయల్ 100కి ఫోన్ చేసినా అది ఆటొమ్యాటిక్ గా 112కి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేస్తారు. ఇక ఈ నెల చివరివరకు 112కు సంబందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ అధికారులు, కాంట్రల్ రూంలో పనిచేసేవారికి నేర్పాలని సూచించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ప్రజలకు అర్ధమయ్యే విధంగా ప్రచారం చేయనున్నారు.
కర్ణాటక, తమిళనాడులో కంట్రోల్ రూంలు
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ ఏడాది మొదటి నుంచే 112పై ప్రచారం చేపట్టాయి. పోలీస్ వాహనాలపై కూడా ఇదే నెంబర్ ముద్రించాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఫలకార్డులు పట్టుకొని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇతర శాఖల ఉద్యోగుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తమిళనాడులోని చెన్నై, మదురై నగరాల్లో కంట్రోల్ రూంలు అందుబాటులోకి తెచ్చారు. ఇక మహారాష్ట్ర కూడా శరవేగంగా అడుగులు వేస్తుంది.
112 ఎందుకు?
ప్రపంచంలోని చాలా దేశాలు అత్యవసర సేవల కోసం ఒకే నెంబర్ వాడుతున్నాయి. అమెరికాలో 911 అనే ఎమర్జెన్సీ నెంబర్ వాడతారు. ఎటువంటి ప్రమాదం జరిగినా దీనికే ఫోన్ చేస్తారు అక్కడి ప్రజలు. ఇక ఐరోపా దేశాల్లో కూడా ఇదే పద్దతి అమలు చేస్తున్నారు. అన్ని అత్యవసర విభాగాలకు కలిపి ఒకే నెంబర్ ఏర్పాటు చేశారు. భారత్ కూడా ఈ దారిలోనే నడవాలని చూస్తుంది. ప్రస్తుతం పోలీస్ కోసం 100, అంబులెన్స్ కోసం 108, ఫైర్ కోసం 101 నెంబర్లకు ఫోన్ చేయాలి.
ఈ అత్యవసర సేవలన్నీ దేశం మొత్తం ఒకే నెంబర్ కిందకు తీసుకొచ్చేందుకు కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నెంబర్ తీసుకురావడానికి ముందు దేశంలోని అన్ని రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం చర్చించింది. ఆ తర్వాత 112ను అత్యవసర సహాయ నెంబర్ గా ప్రకటించింది. ఇకపై ఎమర్జెన్సీకి ఈ 112నే వాడనున్నారు. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించాలని కేంద్రం తెలిపింది.