కాశ్మీర్ లో ఎవరైనా భూమి కొనుక్కోవచ్చు

Centre throws open J&K for land sale : నిన్న మొన్నటి వరకు పర్యాటక కేంద్రంగా ఉన్న కశ్మీర్.. ఇప్పుడు నివాస యోగ్యం కాబోతోంది. జమ్మూ కశ్మీర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జమ్మూ – కశ్మీర్ పూర్తిగా భారత్‌లో అంతర్భాగమని నిరూపించాలని.. కశ్మీర్‌లో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో.. కశ్మీర్ భూ చట్టాల్లో మార్పులపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
భారత దేశంలోని ప్రజలు ఎవరైనా కశ్మీర్‌లోనూ ఇకపై భూమి కొనుగోలు చేసుకోవచ్చు. ఇల్లు సొంతం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా కశ్మీరేతరులకు అక్కడ స్థిరాస్తి కొనుక్కునే అవకాశం లేదు. కేవలం జమ్మూకశ్మీర్ పౌరులకు మాత్రమే ఆ అవకాశం ఉండేది. ఇందుకు వీలు కల్పిస్తున్న ఆ రాష్ట్ర అభివృద్ధి చట్టం సెక్షన్ 17లోని రాష్ట్ర శాశ్వత పౌరులకు మాత్రమే అనే పదాన్ని తొలగిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గెజిట్ జారీ చేసింది. ఈ మార్పు తక్షణమే అమల్లోకి వచ్చింది.
కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. దీన్ని కశ్మీర్ ప్రజలు ముఖ్యంగా అక్కడి యువత తమకు జరిగిన మోసంగా భావిస్తామంటోంది. జమ్మూ-కశ్మీర్‌ను పూర్తిగా అమ్మకానికి పెట్టారని.. చిన్న కమతాలున్నవారు ఇక నష్టపోతారని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. పీడీపీ కూడా ఇదే రీతిలో స్పందించింది. అయితే బీజేపీ మాత్రం మరో వాదన వినిపిస్తోంది.
తాజా మార్పులతో జమ్మూ-కశ్మీర్ ప్రాంతంలో అభివృద్ధి వేగం పుంజుకుంటుందంటోంది. ఇక అభివృద్ధికి గేట్లు తెరచినట్లేనని.. దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన జమ్మూకశ్మీర్‌ను కూడా నిలపాలన్నది కేంద్రం సంకల్పమని స్పష్టం చేసింది. స్థిరాస్తి కొనుగోళ్లపై మార్పుల ప్రభావం వ్యవసాయ భూములకు వర్తించదని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పష్టం చేశారు.
ఈ ప్రాంతంలో పరిశ్రమలను ప్రోత్సహించటం కోసం, ఉపాధి అవకాశాలు పెంచటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని.. వ్యవసాయ భూమిని మాత్రం వ్యవసాయేతరానికి విక్రయించమని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ భూమి స్థానిక రైతుల వద్దే ఉంటుందని మనోజ్ సిన్హా వివరించారు.
విద్య, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ రెండు రంగాలకు వ్యవసాయ భూమిని కూడా కొనుగోలు చేయొచ్చు. పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటుకు వీలుగా జమ్మూ-కశ్మీర్ అభివృద్ధి చట్టం 1970ని కూడా కేంద్రం సవరించింది. ఈ కార్పొరేషన్ ద్వారా పరిశ్రమల కోసం భూమిని సేకరించటం, విక్రయించటం, లీజుకివ్వటంతో పాటు పారిశ్రామికాభివృద్ధి వేగవంతంగా సాగేలా చర్యలు తీసుకుంటారు.