బంగారం ధరలు పెరిగే ఛాన్స్!

gold prices rising : బంగారం ధరలు ఇప్పుడు కాస్త తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ..ముందు ముందు భారీ పెరుగుదల తప్పదా…? ద్రవ్యోల్బణం పెరుగుదల, అమెరికా ఉద్దీపన పథకం బంగారం ధరలను అమాంతం పెంచుతాయా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. రానున్న కొన్ని నెలల్లో పసిడి పైపైకి ఎగబాకుతుందని చెబుతున్నారు. కరోనా, లాక్‌డౌన్ కారణంగా…తీవ్రంగా దెబ్బతిన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు… తిరిగి గాడిన పడే క్రమంలో బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తారని, ఇది ధరల పెరుగుదలకు దారి తీస్తుందని భావిస్తున్నారు. ఈ వారం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు 4.5శాతం తగ్గాయి.
అమెరికా ఎన్నికలు, కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడం వంటి పరిణామాలతో కొన్ని రోజలుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు…ముందు ముందు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయిన జో బైడెన్..జనవరిలో ప్రమాణ స్వీకారం తర్వాత…ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు మరో ఉద్దీపన పథకాన్ని ప్రకటించే అవకాశముందని ప్రపంచ మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. అనుకున్నట్టుగా జనవరి తర్వాత ఉద్దీపన ప్రకటన వెలువడితే..బంగారం ధరలు దూసుకుపోయే అవకాశం ఉంది.
కరోనా పరిస్థితులు, అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు, అమెరికా ఎన్నికలు… కొన్ని నెలలుగా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. బైడెన్ గెలుపుతో అమెరికా -చైనా మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశముందన్న భావన ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ముందు ముందు బంగారం ధరలను ప్రభావితం చేయనున్నాయి.
వచ్చే 18 నెలల కాలంలో పది గ్రాముల బంగారం ధరలు 65వేల నుంచి 67వేలకు చేరే అవకాశముందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం పదిగ్రాముల ధర 49వేల 950గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 49వేల 950గా ఉంది. వచ్చే 18 నెలల కాలంలో రూ. 15 వేలకు పైగా ధరలు పెరిగే అవకాశముంది.