Chandigarh DSP : పోలీసుల ప్యాంట్లు తడిసిపోతాయాన్న సిద్ధూకి చండీగఢ్ డీఎస్పీ వార్నింగ్

పోలీసులపై పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు చండీగఢ్ డీఎస్పీ దిల్షేర్ సింగ్ చాందెల్.

Chandigarh DSP : పోలీసుల ప్యాంట్లు తడిసిపోతాయాన్న సిద్ధూకి చండీగఢ్ డీఎస్పీ వార్నింగ్

Sidhu

Updated On : December 26, 2021 / 6:35 PM IST

Chandigarh DSP : పోలీసులపై పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు చండీగఢ్ డీఎస్పీ దిల్షేర్ సింగ్ చాందెల్. మాటలు అదుపులో పెట్టుకోవాలని సిద్ధూని హెచ్చరించారు.

కాగా,డిసెంబర్-19న కపుర్తలా జిల్లాలోని సుల్తాన్ పూర్ లోధిలో కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలో సిద్ధూ మాట్లాడుతూ..”కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ్తేజ్ సింగ్ చీమ చాలా ధైర్యవంతుడు. ఆయన పోలీసుల ప్యాంట్లు తడపగలడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నేను చెప్తున్నది ఒక్కటే మీరు కూడా నవ్తేజ్‌లా ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు. సిద్ధూ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ సిద్ధూ అవేవీ పట్టించుకోలేదు.

శనివారం సిద్ధూ వ్యాఖ్యలను ఖండిస్తూ చండీగఢ్ డీఎస్పీ దిల్షేర్ సింగ్ చాందెల్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆవీడియోలో..”నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలతో నేను తీవ్రంగా బాధపడ్డాను. భారత పోలీసులు, పంజాబ్ పోలీసులు మరియు చండీగఢ్ పోలీసుల తరపున నేను అతని వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేయడం ద్వారా సిద్ధూ మొత్తం పంజాబ్ పోలీసుల పరువు తీశారు.

రాజకీయ నేతల సూచనలను పాటించేలా చేసేది పోలీసులే. పోలీసులు లేకుంటే రిక్షా పుల్లర్ కూడా రాజకీయ నాయకుల సూచనలను పాటించడు. సిద్ధూ ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి. అయినా దేశవ్యాప్తంగా పోలీసులు ఇంత తక్కువగా ఉన్నారని భావిస్తే, సిద్ధూ తన భద్రతను వదులుకోవాలి” అని డీఎస్పీ అన్నారు. అలాగే, వీడియో చివరలో డీఎస్పీ చందేల్ ఒక కవితను పఠించారు. భద్రతా దళాల త్యాగాలను మరచిపోవద్దని ప్రజలను కోరారు. సిద్ధూకి వార్నింగ్ ఇస్తున్న డీఎస్పీ చాందెల్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ALSO READ Director Anil Ravipudi: ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు..!