అక్రమంగా ఆక్రమించారు.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

జమ్మూకశ్మీర్,లడఖ్ లు ఇవాళ(అక్టోబర్-31,2019)నుంచి కేంద్రపాలిత ప్రాంతాలుగా అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో చైనా తీవ్రమైన వ్యాఖ్యాలు చేసింది. భారత్ నిర్ణయం చట్ట వ్యతిరేకమని, ఇది చెల్లదని కామెంట్ చేసింది. చైనా చేసిన వ్యాఖ్యలకు భారత్ దీటుగా జవాబిచ్చింది. భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని తేల్చిచెప్పింది. లద్దాఖ్, జమ్మూ, కశ్మీర్‌లు భారత్‌లో అంతర్భాగమని మరోసారి స్పష్టం చేసింది.
భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను ఇతర దేశాలు గౌరవించాలని మేం కొరుకుంటున్నాం. లడఖ్, కశ్మీర్‌లోని కొంత భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించిందని, చైనా-పాకిస్థాన్ సరిహద్దు ఒప్పందం కింద 1963లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కొంత భాగాన్ని కూడా చైనా చట్టవ్యతిరేకంగా ఆక్రమించిందని విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకోదని, అదేవిధంగా ఇతర దేశాలు కూడా భారత్ వ్యవహారాల్లో తలదూర్చకూడదని తాము ఆశిస్తున్నామని రవీశ్ తెలిపారు.