Cough Syrup: దగ్గు మందు తాగి ఇద్దరు పిల్లలు మృతి.. అదేం లేదు.. నేను తాగుతా అని తాగిన డాక్టర్.. కట్ చేస్తే..

ఐదేళ్ల నితీష్‌కు దగ్గు, జలుబు రావడంతో అతని తల్లిదండ్రులు ఆదివారం చిరానాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి తీసుకెళ్లారు.

Cough Syrup: దగ్గు మందు తాగి ఇద్దరు పిల్లలు మృతి.. అదేం లేదు.. నేను తాగుతా అని తాగిన డాక్టర్.. కట్ చేస్తే..

Updated On : October 1, 2025 / 7:28 PM IST

Cough Syrup: దగ్గు మందు ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసింది. 10 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. అందేకాదు ఓ డాక్టర్ ప్రాణాల మీదకు తెచ్చింది. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ ఘోరం జరిగింది. అసలేం జరిగిందంటే..

అదొక జనరిక్ దగ్గు మందు. రాజస్థాన్ ప్రభుత్వం కోసం ఓ ఫార్మా కంపెనీ ఆ మందును తయారు చేసింది. ఈ దగ్గు మందు పిల్లల పాలిట మృత్యువుగా మారింది. ఈ దగ్గు మందు తీసుకున్న పిల్లల్లో ఇద్దరు చనిపోయారు. 10మంది అస్వస్థతకు గురయ్యారు. గత 2 వారాల వ్యవధిలో ఈ ఘనలు చోటు చేసుకున్నాయి. అయితే, దగ్గు మందు వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, అది చాలా సురక్షితమైనదని ఓ డాక్టర్ వాదించారు. అంతేకాదు అది ఎంత సేఫ్ అనేది తెలియజేసేందుకు స్వయంగా ఆయనే సిరప్ ఒక డోస్ తీసుకున్నారు. కట్ చేస్తే.. ఆయన స్పృహ కోల్పోయారు. 8 గంటల తర్వాత ఓ కారులో ఆ డాక్టర్ ను గుర్తించారు.

ఆ దగ్గు మందులో డెక్స్ ట్రో మెథోఫ్రాన్ హైడ్రోబ్రోమైడ్ అనే కాంపౌండ్ ఉంది. కేసన్ ఫార్మా అనే సంస్థ ఈ దగ్గు మందును తయారు చేసింది. ఈ మందు తీసుకున్న కొన్ని గంటల తర్వాత ఐదేళ్ల బాలుడు మరణించాడు.

రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన ఐదేళ్ల నితీష్‌కు దగ్గు, జలుబు రావడంతో అతని తల్లిదండ్రులు ఆదివారం చిరానాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి తీసుకెళ్లారు. డాక్టర్ దగ్గు సిరప్‌ రాశారు. హెల్త్ సెంటర్ నుంచి ఆ సిరప్ తీసుకుని ఇంటికి వెళ్లాక.. నితీష్ తల్లి ఆ రాత్రి 11.30 గంటల ప్రాంతంలో దానిని అతనికి ఇచ్చింది.

నితీశ్ తెల్లవారుజామున 3 గంటలకు ఒకసారి నిద్ర లేచాడు. అతడికి ఎక్కిళ్ళు వచ్చాయి. దీంతో అతని తల్లి అతనికి కొంచెం నీళ్ళు ఇచ్చింది. నీళ్లు తాగి నితీశ్ మళ్ళీ నిద్రపోయాడు. ఇక అంతే, ఆ తర్వాత నితీశ్ లేయలేదు. బాలుడిలో చలనం లేకపోవడంతో తల్లిదండ్రుడు కంగారుపడ్డారు. వెంటనే నితీశ్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నితీశ్ ను పరిశీలించిన డాక్టర్లు.. అప్పటికే చనిపోయాడని చెప్పడంతో తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారు.

”ఆ రోజు నితీశ్ బాగానే ఉన్నాడు. సాయంత్రం నవరాత్రి పూజకు కూడా వెళ్ళాడు. రాత్రి మళ్ళీ దగ్గుతుండగా, చిరానా సిహెచ్‌సి నుండి మేము తెచ్చుకున్న మందును అతనికి ఇచ్చాం. ఉదయం ఎంత లేపినా అతను లేవలేదు. వెంటనే సిహెచ్‌సికి తీసుకెళ్లాము. వెంటనే బాబుని సికార్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. డాక్టర్ సూచించిన మోతాదు మేరకు మందు ఇచ్చాము. మందు తీసుకునే ముందు బాగానే ఉన్నాడు” అని బాలుడి మామ శర్మ తెలిపారు.

దగ్గు మందు తాగి రెండేళ్ల బాబు మృతి..

సెప్టెంబర్ 22న కూడా ఇలాంటి ఘటనే జరిగింది. దగ్గు మందు తాగిన రెండేళ్ల బాబు మరణించాడు. బయనాలోనూ ఇలాంటి ఘోరమే జరిగింది. మూడేళ్ల గగన్ కుమార్ దగ్గు మందు తాగి మరణించాడు. దీంతో అతడి తల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి వెళ్లింది. ఆ మందు రాసిన డాక్టర్ తారాచంద్ యోగిని నిలదీసింది. మీరు రాసిచ్చిన దగ్గు మందు వల్లే నా కొడుకు చనిపోయాడని ఆమె కన్నీటిపర్యంతమైంది. అయితే దగ్గు మందులో ఏమీ లేదని డాక్టర్ తెలిపాడు. అంతేకాదు కాఫ్ సిరప్ సురక్షితం అన్నాడు. కావాలంటే నేను నిరూపిస్తాను చూడండి అంటూ.. ఆ డాక్టర్ ఆ దగ్గు మందును తీసుకున్నాడు. ఆ తర్వాత తన కారులో భరత్ పూర్ కు ప్రయాణం అయ్యాడు. అయితే దారిలో అతడికి మగతగా అనిపించింది. వెంటనే కారుని రోడ్డు పక్కన ఆపేశాడు. ఇంతలోనే స్పృహ తప్పి పడిపోయాడు. చాలా సేపు ఆ డాక్టర్ నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో, అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. డాక్టర్ మొబైల్ లొకేషన్‌ను ట్రాక్ చేయగా, 8 గంటల తర్వాత కారులో పడి ఉండటాన్ని కనుగొన్నారు.

గత వారం రోజుల్లో దక్షిణ రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాలో ఒకటి నుండి 5 సంవత్సరాల వయస్సు గల ఎనిమిది మంది పిల్లలు కూడా ఈ ఔషధం సేవించి అస్వస్థతకు గురయ్యారు.

ఇద్దరు పిల్లలు చనిపోయారని, మరికొందరు అనారోగ్యానికి గురయ్యారని వార్తలు వెలువడిన తర్వాత, రాజస్థాన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. 22 బ్యాచ్‌ల కాఫ్ సిరప్‌ను నిషేధించింది. వాటి పంపిణీని నిలిపివేసింది. ఈ ఏడాది జూలై నుంచి రాజస్థాన్‌లో 1.33 లక్షల బాటిళ్ల సిరప్‌ను రోగులకు అందించినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు.

ఆ దగ్గు మందు పంపిణీ బంద్..

జైపూర్‌లోని SMS ఆసుపత్రిలో 8,200 కు పైగా సిరప్ బాటిల్స్ స్టాక్‌లో ఉన్నాయి. అయితే వాటిని ఎవరికీ ఇవ్వకుండా చూసుకోవాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.

దీనిపై మహాత్మా గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి చిన్న పిల్లల డాక్టర్ బన్స్ వారా స్పందించారు. ఈ ఔషధం కారణంగా కొంతమంది పిల్లలకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా మగతగా అనిపించిందన్నారు. అందుకే దీనిపై నిషేధించం విధించామన్నారు. అధిక మోతాదులో సిరప్ తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి రియాక్షన్స్ సంభవించవచ్చన్నారు. బన్స్వారాలో చాలా మంది పిల్లలు చికిత్స తర్వాత కోలుకున్నారు. ఆరేళ్ల బాలుడి ఆరోగ్య పరిస్థితి విషంగా ఉంది.

దీనిపై రాజస్థాన్ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేస్తున్న జై సింగ్ స్పందించారు. ఆ దగ్గు సిరప్‌ను సూచించడం ఆపేయాలని డాక్టర్లను కోరినట్లు ఆయన తెలిపారు. “22 బ్యాచ్‌ల నుండి నమూనాలను పరీక్షిస్తున్నాము. ఈ ఔషధం కోసం కేసన్ ఫార్మా నుండి సరఫరాలు నిలిపివేయబడ్డాయి” అని ఆయన అన్నారు.

రాజస్థాన్ డ్రగ్ కంట్రోలర్ అజయ్ ఫాటక్ మాట్లాడుతూ, అదే కంపెనీ సరఫరా చేసిన దగ్గు సిరప్‌లో మెంథాల్ శాతం తక్కువగా ఉన్నందున 2023లో దానిని నిషేధించారని గుర్తు చేశారు.

Also Read: రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ.. కరెన్సీపై భరతమాత.. దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్..