Corona Vaccine: వ్యాక్సిన్లలో కరోనావైరస్ అస్సలు ఉండదు
వ్యాక్సిన్ వేయించుకున్నాక జ్వరం, ఒళ్లు నొప్పులు, కొద్దిగా దగ్గు, జలుబు చేసినట్లు కూడా ఉంటుంది...

Covid 19 Virus From The Faeces Of An Infected Person Appears To Be Low
Corona Vaccine: వ్యాక్సిన్ వేయించుకున్నాక జ్వరం, ఒళ్లు నొప్పులు, కొద్దిగా దగ్గు, జలుబు చేసినట్లు కూడా ఉంటుంది. ఇవన్నీ కచ్చితంగా వస్తాయి. వ్యాక్సిన్ వేయించుకున్నాక 15 రోజుల వరకు ఎప్పుడు టెస్టు చేయించుకున్నా పాజిటివ్ అనే వస్తుంది. అందుకని భయపడొద్దని చెప్పండి. టెస్టులు చేయించుకోవద్దని చెప్పండి. అనవసరంగా పాజిటివ్ అని భయపడొద్దు..’అంటూ మెడికల్ స్టాఫ్ చెప్తున్నట్టుగా ఓ ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇందులో ఎంతమాత్రం నిజం లేదని, దాన్ని నమ్మొద్దని వైద్య నిపుణులు చెప్తున్నారు. వ్యాక్సిన్లలో కరోనా వైరస్ ఉండదని, వ్యాక్సిన్ వల్ల పాజిటివ్ రాదని స్పష్టం చేస్తున్నారు. అమెరికాకు చెందిన ‘వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ)’కూడా ఇప్పటికే దీనిపై తగిన వివరణ ఇచ్చింది. ఏ వ్యాక్సిన్ వేయించుకున్నా టెస్టుల్లో పాజిటివ్ రాదని.. ఒకవేళ వస్తే సదరు వ్యక్తికి నిజంగా కరోనా ఇన్ఫెక్షన్ సోకినట్టేనని తెలిపింది.
వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందే వైరస్ సోకి తగ్గిపోతే.. యాంటీబాడీస్ టెస్టుల్లో నిర్ధారణ చేసుకోవచ్చని పేర్కొంది. ఇందులో ఐజీఎం టెస్టులో పాజిటివ్ వస్తే అంతకుముందు వారంలో ఇన్ఫెక్షన్ వచ్చినట్టు అని.. ఐజీజీలో పాజిటివ్ వస్తే అంతకు 14 రోజులకు ముందు ఎప్పుడైనా కరోనా వచ్చినట్టు వెల్లడి అవుతుందని వివరించింది. వ్యాక్సిన్ వేసుకున్నాక పాజిటివ్ వస్తే.. కరోనా అప్పటికే సోకి ఉండటంగానీ, వ్యాక్సిన్ వేసుకున్నాక సోకడంగానీ జరిగి ఉంటుందనే నిర్ధారణకు రావాలని తెలిపింది.
వ్యాక్సిన్లు 3 రకాలుగా ఎలా తయారుచేస్తారు. ఒక్కోదాని వల్ల కలిగే ప్రయోజనాలు, తేడాలు ఈ విధంగా ఉన్నాయి.
1) ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లు:
మోడెర్నా, ఫైజర్ టీకాలు ఈ కోవలోకి వస్తాయి. ఈ వ్యాక్సిన్లలో కరోనా వైరస్‌లోని జన్యు పదార్థాన్ని ఎంఆర్‌ఎన్‌ఏగా మార్చి వినియోగిస్తారు. నిజానికి ఒరిజినల్ కరోనా వైరస్‌లో ఆర్‌ఎన్‌ఏ మాత్రమే ఉంటుంది. దీన్ని జెనెటిక్ పద్ధతిలో ఎంఆర్‌ఎన్‌ఏగా మారుస్తారు. ఈ ఎంఆర్‌ఎన్‌ఏలో స్పైక్ ప్రొటీన్ డేటా ఉంటుంది.
వ్యాక్సిన్ వేసినప్పుడు అందులోని ఎంఆర్‌ఎన్‌ఏ శరీర కణాల్లోకి వెళ్లి స్పైక్ ప్రొటీన్‌గా మారుతుంది. అది కణాల నుంచి బయటికి రాగానే శరీరం గుర్తించి యాంటీ బాడీస్‌ను ఉత్పత్తి చేస్తుంది.
2) ఎడినో వైరస్ వెక్టార్ వ్యాక్సిన్లు:
స్పుత్నిక్, జాన్సన్, ఆక్స్‌ఫర్డ్ టీకాలు ఈ తరహాలో అభివృద్ధి చేశారు. ఇందులో.. మనుషులు, ఇతర జంతువుల్లో జలుబును కలిగించే ఎడినో వైరస్‌లను తీసుకుని, బలహీన పరుస్తారు. వాటికి కరోనా వైరస్ జన్యుపదార్థాన్ని జోడించి వ్యాక్సిన్ రూపొందిస్తారు. అందుకే వీటిని ఎడినో వైరస్ వెక్టార్ వ్యాక్సిన్లు అంటారు. ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు మన శరీరం.. టీకాలోని అడినోవైరస్‌ను, దానికి జోడించిన కరోనా స్పైక్ ప్రొటీన్స్‌ను గుర్తించి యాంటీ బాడీస్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.
ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌లో చింపాంజీలో జలుబును కలిగించే ఎడినో వైరస్‌ను వెక్టార్‌గా వాడారు. జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలో మనుషుల్లో జలుబుకు కారణమయ్యే ఎడినో వైరస్ 26 రకాన్ని వినియోగించారు. స్పుత్నిక్‌లో అయితే తొలిడోసులో ఎడినో వైరస్ 26, రెండో డోస్‌లో ఎడినో వైరస్ 25 రకాలను వెక్టార్లుగా వినియోగించారు.
3) ఒరిజినల్ వైరస్‌ను నిర్వీర్యం చేసి..:
ఒరిజినల్ కరోనా వైరస్‌ను నిర్వీర్యం చేసి ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే తరహా టీకా కోవాగ్జిన్. ఈ తరహా వ్యాక్సిన్ రక్తంలోకి ప్రవేశించగానే.. శరీరంలోని టీసెల్స్ అది అసలైన వైరస్‌గా భావించి అంటుకుంటాయి. దీనితో డి సెల్స్ ప్రభావితమై.. శరీరంలో రోగ నిరోధక శక్తిని ప్రేరేపిస్తాయి. దీనితో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి.
ఏ మాత్రం వైరస్ ఉన్నా ‘ఆర్టీపీసీఆర్’ గుర్తిస్తుంది
ఆర్టీపీసీఆర్ పరీక్ష కోసం గొంతు లేదా ముక్కు నుంచి శాంపిళ్లు తీసుకుంటారు. సజీవంగా ఉన్న వైరస్‌లో ఆర్‌ఎన్‌ఏ జన్యు పదార్థం ఉంటుంది. ఆ శాంపిల్స్‌కు ఎంజైమ్‌ను కలిపి డీఎన్‌ఏగా మారుస్తారు. దీనిని 36 రెట్లు వృద్ధి చేసి.. ఆర్టీపీసీఆర్‌లోని యాంటిలిఫికేషన్ టెక్నాలజీ ద్వారా పరీక్షిస్తారు. వైరస్ ఉంటే కచ్చితంగా గుర్తించేలా టెస్టు ఉంటుంది. చాలా వరకు 20 సార్లు వృద్ధి చేసే సరికే కరోనా వైరస్ ఉందా లేదా అన్నది తేలిపోతుంది.
వ్యాక్సిన్లన్లీ యాంటీ బాడీస్‌ను ప్రేరేపించేవే..
కరోనా వ్యాక్సిన్లన్నీ కూడా మన శరీరంలో యాంటీ బాడీస్‌ను లేదా టీ సెల్స్‌ను ప్రేరేపించేవి మాత్రమే. ఒకవేళ వైరస్ సోకినా తక్కువ లోడ్‌తో ఇన్ఫెక్షన్ వస్తుంది. రోగ తీవ్రత తగ్గుతుంది. వ్యాక్సిన్ వేసుకోని వాళ్లకంటే వ్యాక్సిన్లు వేసుకున్న వారిలో నమోదయ్యే కేసులు 80-94 శాతం తక్కువగా ఉన్నాయని గమనించాలి.