Hotel Customer shocked: 40 పైసల కోసం కోర్టుకెక్కిన కస్టమర్, రూ.4 వేలకు ఎసరు పడింది
అత్యుత్సాహం అనాలో లేక అమాయకత్వం అనాలో తెలియడం లేదుగాని..40 పైసలు కోసం కోర్టుకెక్కిన ఓ కస్టమర్ చివరకు తానే రూ.4 వేలు చెల్లించుకున్నాడు.

Hotel Bill
Hotel Customer shocked: అత్యుత్సాహం అనాలో లేక అమాయకత్వం అనాలో తెలియడం లేదుగాని..40 పైసలు కోసం కోర్టుకెక్కిన ఓ కస్టమర్ చివరకు తానే రూ.4 వేలు చెల్లించుకున్నాడు. హోటల్ బిల్లులో 40 పైసలు ఎక్కువగా తీసుకున్నారంటూ వినియోగదారుల ఫోరంకు వెళ్లిన ఓ కస్టమర్ కు కోర్టు షాక్ ఇచ్చింది. ఈఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..మూర్తి అనే ఓ వ్యక్తి 2021 మే నెలలో బెంగళూరులోని హోటల్ ఎంపైర్‌లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. అనంతరం హోటల్ సిబ్బంది రూ.265 బిల్లు ఇచ్చారు. అయితే బిల్లు రూ.264.60 అయినప్పటికీ హోటల్ యాజమాన్యం రూ.265 వసూలు చేసింది. దీనిపై హోటల్ సిబ్బందిని మూర్తి ప్రశ్నించగా.. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో బెంగళూరు వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. రెస్టారెంట్ యాజమాన్యం చిల్లర చెల్లించకుండా ప్రజలను దోచుకుంటుందని కోర్టులో వాదించాడు మూర్తి. అంతే కాదు 40 పైసలను రౌండ్ ఫిగర్ చేసి ఒక రూపాయి తనకు చెల్లించాలని డిమాండ్ చేశాడు.
Also read: Punjab CM: భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి రూ.2 కోట్లు ఖర్చు: గోధుమ పంట నాశనం
దీనిపై హోటల్ తరుపు న్యాయవాదులు అంషుమాన్, ఆదిత్య ఆంబ్రోస్ లు తమ వాదనలు కోర్టుకు వినిపించారు. రెస్టారెంట్ ఛార్జ్ చేసిన అమౌంట్ ఫుడ్ కోసం కాదని, ట్యాక్స్ కిందకు వస్తుందని కోర్టుకు తెలియజేశారు. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్ 2017 లోని సెక్షన్ 170 ప్రకారమే రెస్టారెంట్ బిల్లు వేసిందని కోర్టుకు విన్నవించారు. చట్టం ప్రకారం 50 పైసల కంటే తక్కువ ఉన్న మొత్తాన్ని వదిలేయవచ్చు లేదా 50 పైసల కంటే ఎక్కువ ఉంటే దాన్ని రూపాయిగా రౌండ్ ఫిగర్ చేసి తీసుకోవచ్చు. అక్కడ రెస్టారెంట్ ఇదే సూత్రాన్ని పాటించింది. రూ.264.60 పైసలు అయిన బిల్లును రూ.265గా మార్చి తీసుకుంది. దీంతో ఛార్జ్ వసూలు చేయడంలో రెస్టారెంట్‌కు ఎలాంటి లోపం లేదని కోర్టు పేర్కొంది.
Also read: The Kashmir Files: ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు: రాజకీయ దుమారం
దీనిపై మార్చి 4న తీర్పు వెలువరించిన కోర్టు..ఇలాంటి అర్ధ రహితమైన కారణాలతో కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు మూర్తిని మందలించింది. అంతే కాదు రెస్టారెంట్ కోర్టు ఖర్చుల నిమిత్తం 2000 రూపాయలు, జరిమానాగా కోర్టుకు 2000 రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లించాలని బెంగళూరు వినియోగదారుల కోర్టు మూర్తిని ఆదేశించింది. అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన మూర్తిని కోర్టు మందలిస్తూ మరోసారి ఇటువంటి పొరబాట్లు చేయవద్దని హితవు పలికింది.
Also read: Telangana High Court : సస్పెన్షన్‌కు గురైన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు సూచన