దాదా షెహన్ షా : అమితాబ్‌కు అభినందనల వెల్లువ

  • Published By: madhu ,Published On : September 25, 2019 / 01:34 AM IST
దాదా షెహన్ షా : అమితాబ్‌కు అభినందనల వెల్లువ

Updated On : September 25, 2019 / 1:34 AM IST

66వ దాదాసాహెబ్ ఫాల్కే సినీ అత్యున్నత పురస్కారం.. బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్‌కు దక్కింది. సినీ రంగంలో ఆయన అందించిన విశేష సేవలకు గానూ కమిటీ.. బిగ్ బీని ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ మేరకు.. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు. దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి అమితాబ్‌ ఎంపిక కావడం పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కొనియాడుతున్నారు. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్‌ నటులు సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.

1942 అక్టోబర్ 11న అలహాబాద్‌లో జన్మించిన అమితాబ్.. 70వ దశకంలో.. సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చి.. యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా సినిమా హాల్స్‌ను ఓ ఊపు ఊపారు అమితాబ్. హీరోగా.. నిర్మాతగా.. సింగర్‌గా.. అన్ని రకాలుగా అమితాబ్ అదరగొట్టేశారు. రాజీవ్ గాంధీ హయాంలో పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. రాజకీయాలు తనకు సరిపడవని గుర్తించి.. పద్ధతిగా తప్పుకున్నారు.

1969లో సాత్ హిందుస్తానీ సినిమాలో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చారు అమితాబ్. 1971లో రిలీజైన ఆనంద్ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్టై.. బిగ్ బీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు.. అమితాబ్‌కు ఉత్తమ సహాయనటుడి ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. 1973లో రిలీజైన జంజీర్ సినిమా.. అమితాబ్ కెరీర్‌ను కొత్త మలుపు తిప్పింది. 

1975లో అమితాబ్ నటించిన రెండు సూపర్ హిట్ సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి దీవార్, మరొకటి షోలే. దీవార్ మూవీలో.. అమితాబ్ విశ్వరూపం చూపించారు. ఇక షోలే బిగ్ బి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్.  ఆసినిమా ఎంత బ్లాక్ బస్టరో.. ఆ తరానికి.. ఈ తరానికి బాగా తెలుసు. 1977లో వచ్చిన అమర్ అక్బర్ ఆంథోని సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డాన్ సినిమాలో నటనకు బిగ్ బీకి.. బెస్ట్ యాక్టర్ అవార్డ్ దక్కింది. 1988లో అమితాబ్ నటించిన షెహన్ షా.. బాక్సాఫీస్ దగ్గర హిట్టయింది. ఈ మధ్యే వచ్చిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రంలో అమితాబ్ అదరగొట్టేశారు.

బాలీవుడ్‌లో బిగ్ బి గా తనదైన ముద్ర వేసుకున్నారు. హిందీ సహా.. అనేక భాషల్లో నటించారు. 2011లో పద్మభూషణ్, 2015లో పద్మవిభూషణ్ అవార్డును.. భారత ప్రభుత్వం ప్రదానం చేసింది. ఫ్రెంచ్ ప్రభుత్వం నైట్ హుడ్ బిరుదుతో సత్కరించింది.

షోలే, దీవార్‌, డాన్‌, కూలీ, అగ్నిపథ్‌, బ్లాక్‌, పా, పీకూ చిత్రాల్లో అద్భుతమైన నటనతో అలరించారు అమితాబ్. దాదాపు 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో సుమారు 200కు పైగా చిత్రాల్లో నటించారు. చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ సైరాలోనూ.. అమితాబ్ నటించారు.