రోజువారీ కూలీకి రూ.కోటి TAX కట్టాలని నోటీసులు

రోజువారీ కూలీకి రూ.కోటి TAX కట్టాలని నోటీసులు

Updated On : January 16, 2020 / 6:48 AM IST

కూలీ వేతనం రోజుకు రూ.300లే. అయినా కోటి రూపాయల ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాలంటూ నోటీసులు పంపారు అధికారులు. ముంబైలోని అంబివలి బస్తీలో ఉండే ఆ వ్యక్తి కాపాడాలంటూ పోలీసులకు మొరపెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. బాబు సాహెబ్ అనే వ్యక్తి రోజుకు రూ.300సంపాదిస్తున్నాడు. తనకు వచ్చిన నోటీసులు తీసుకుని నేరుగా పోలీసుల వద్దకు వెళ్లాడు. 

విచారణలో బయటపడిన విషయం చూసి కంగుతిన్నాడు. 2016 నోట్ల రద్దు సమయంలో అతని అకౌంట్లో గుర్తు తెలియని వ్యక్తులు రూ.58లక్షలు డిపాజిట్ చేసిన విషయం బయటపడింది. దాని గురించి తనకు తెలియదని తనను కాపాడాలంటూ పోలీసుల ముందు లబోదిబోమన్నాడు. 

ఆ అకౌంట్ ఫేక్ డాక్యుమెంట్లతో తయారుచేసినది కూడా అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. తన మామ ఇంట్లో ఉంటున్న వ్యక్తికి సెప్టెంబరులో మొదటిసారి 2016నోట్ల రద్దు విషయంలో తన అకౌంట్లో డబ్బులు పడ్డాయని నోటీసులు వచ్చాయి. అప్పుడు ఐటీ ఆఫీసుకు, బ్యాంకుకు వెళ్లి కనుక్కుంటే అతని పాన్ కార్డు మీద అకౌంట్ ఓపెన్ అయినట్లు తెలిసింది కానీ, వేరే వ్యక్తి ఫొటో, కల్పిత సంతకాలు ఉన్నాయి. 

జనవరి 7న మరోసారి నోటీసులు వచ్చాయి. ఈ సారి రూ.1కోటి 5వేలు చెల్లిచాలని రావడంతో రెండో నోటీసుకు పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.