సంప్రదాయం కంటే ప్రేమే గొప్పది: అత్త పాడెను మోసిన కోడళ్లు

  • Published By: vamsi ,Published On : September 15, 2019 / 03:23 PM IST
సంప్రదాయం కంటే ప్రేమే గొప్పది: అత్త పాడెను మోసిన కోడళ్లు

Updated On : September 15, 2019 / 3:23 PM IST

అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్తా గుణవంతురాలు.. అంటుంటారు. అసలు అత్త లేకపోతే అత్తా కోడళ్ళ మధ్య గొడవలు ఉండవు కదా! అందుకే అలాంటి కోడల్ని ఉత్తమురాలన్నారు. అలాగే కోడలు లేని అత్త  గుణవంతురాలు అంటే కోడలు లేదనుకో అత్తకు అరవాల్సిన పనిలేదు. గుణవంతురాలుగానే ఉంటుందని అంటారు.

ప్రస్తుతం సమాజంలో ఉన్న అత్తాకోడళ్ల పరిస్థితి కూడా చాలావరకు ఈ సామెతకు దగ్గరగానే ఉంది. అయితే మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో మాత్రం కోడళ్లు అత్తని దేవతలా పూజించారు. అత్త చనిపోతే భూజాలపై శవాన్ని మోస్తూ అత్త మీద ప్రేమను చనిపోయిన తర్వాత కూడా చూపించారు.

వివరాల్లోకి వెళ్తే.. బీడ్ జిల్లాలో మరాఠ్వాడలోని పట్టణంలోని కాశీనాథ్ నగర్ ప్రాంతంలో సుందర్ బాయి దగ్డూ(83) అనే వ్యక్తి వయస్సు మీద పడడంతో చనిపోయారు. ఆమెకు నలుగురు కోడళ్లు.. ఆమె బ్రతికి ఉన్నంతకాలం ఆమెను కోడళ్లు అపురూపంగా చూసుకున్నారు. అలాగే ఆమె కూడా కోడళ్లను కూతుళ్లలా చూసుకుంది.

అయితే ఆమె చనిపోవడంతో విలవిలాడిపోయిన కోడళ్లు సంప్రదాయాలు, కట్టుబాట్లను పక్కనబెట్టి ఆమె పాడెను భుజాలపై మోశారు. మృతదేహాన్ని నలుగురు కోడళ్లు అయిన లతా, ఉషా, మనీషా, మీనా తమ భుజాలపై మోసిన సంఘటనకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సుందర్ బాయి దగ్డూ కళ్లను కూడా ఆమె కోరిక మేరకు ఆసుపత్రికి దానం చేశారు.