ఢిల్లీలో కరోనా తగ్గుముఖం..వైరస్ కట్టడికి కేజ్రీ సర్కార్ ఏం చేసింది ?

  • Published By: madhu ,Published On : July 24, 2020 / 11:36 AM IST
ఢిల్లీలో కరోనా తగ్గుముఖం..వైరస్ కట్టడికి కేజ్రీ సర్కార్ ఏం చేసింది ?

Updated On : July 24, 2020 / 12:14 PM IST

యావత్‌ దేశాన్ని వణికిస్తోన్న మహమ్మారి కరోనా కట్టడిలో దేశ రాజధాని ఢిల్లీ… ముందంజలో నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యల కారణంగా దేశ రాజధానిలో ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నాయి. AAP పార్టీ నేతృత్వంలోని Arvind Kejriwal సర్కార్‌.. పక్కా ప్రణాళికలతో … ప్రస్తుతం కేసుల సంఖ్య నిలకడగా ఉంది.

జూన్‌ మొదటి వారంలో రోజుకు రెండువేలుగా నమోదైన కేసుల సంఖ్య.. జూన్‌ 23 నాటికి దాదాపు నాలుగు వేలకు చేరింది. ఇన్‌ఫెక్షన్‌ రేటు పెరుగుతుండడంతో తొలుత ఢిల్లీ నగరవాసుల్లో ఆందోళన మొదలైంది. టెస్టుల సామర్థ్యం, ఆస్పత్రుల్లో పడకల పెంపు, కంటైన్‌మెంట్ జోన్లలో కఠినంగా నిబంధనల అమలులాంటి యాక్షన్‌ప్లాన్‌తో కరోనాను ఢిల్లీ కట్టడి చేసింది.

కోవిడ్‌ నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం పక్బంధీగా అమలు చేసింది. దీంతో హస్తినలో కరోనా వ్యాప్తిని సాధ్యమైనంత ఎదుర్కోవడంలో Arvind Kejriwal సర్కార్‌ సక్సెస్‌ అయ్యిందన్న చర్చ జరుగుతోంది. రోజుకు నాలుగువేల కేసుల నుంచి 15వందలకు ఆ సంఖ్యను నియంత్రించింది. ఇందుకోసం ఢిల్లీ సర్కార్‌ కరోనాతో యుద్ధమే చేసింది.

Corona మహమ్మారికి కళ్లెం వేయడానికి ఢిల్లీ ప్రభుత్వం.. ప్రధానంగా ఐదు అంశాలను పరిగణలోకి తీసుకుని కార్యాచరణ రూపొందించింది. ఆస్పత్రుల్లో పడకలు, టెస్టింగ్‌ల సామర్థ్యం పెంపు, ఐసోలేషన్‌, ఆక్సీమీటర్ల పంపిణీ, ప్లాస్మా థెరపి, ఇంటింటి సర్వే స్క్రీనింగ్‌ పరీక్షల నిర్వహణపై దృష్టి పెట్టింది.

కరోనా ఓడుతుంది – ఢిల్లీ విజయం సాధిస్తుందనే నినాదంతో కేజ్రీవాల్‌ ముందుకెళ్లింది.ప్రజల్లో ధైర్యాన్ని నింపింది. కేసులు పెరుగుతోన్న క్రమంలో పలు రాష్ట్రాల సీఎంలు ముఖం చాటేస్తే.. కేజ్రీవాల్‌ మాత్రం వాల్‌గానే నిలిచారు. కేరళ తర్వాత ఈ స్థాయిలో కరోనాపై విజయం సాధించిన రాష్ట్రం ఢిల్లీ ఒక్కటే.

ఒకానొక సందర్భంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కూడా కరోనా లక్షణాలు కనిపించాయి. కేబినెట్‌లోని మంత్రులకూ వైరస్‌ సోకినా… తాను మాత్రం ప్రజలను వీడలేదు. ప్రతిరోజు మీడియా ద్వారా ప్రజలకు ధైర్యాన్ని చెప్పారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ.. యాక్షన్‌ప్లాన్‌ అమలు చేశారు. ఇదే సందర్భంలో వైద్యులు, పారిశుధ్య కార్మికుల్లో భరోసా నింపారు.

దీంతోపాటు.. కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రారంభించిన ప్లాస్మా థెరపీ కూడా అద్భుత ఫలితాలను ఇచ్చింది. ఎంతోమంది స్వచ్చందంగా వచ్చి ప్లాస్మాని దానం చేయడంతో.. కరోనా తోక ముడిచింది.

జులై నెలాఖరుకు దేశ రాజధాని ఢిల్లీలో 5 లక్షల 50వేల కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు గతంలో డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా వెల్లడించారు. జూన్‌ 9 నాటికి రాష్ట్రంలో డబ్లింగ్‌ రేటు 12 నుంచి 13 రోజులుగా నమోదు కావడంతో.. జూన్‌ 30 నాటికి ఈ కేసుల సంఖ్య లక్షకు చేరుకుంటుందని భావించారు.

జులై 15 నాటికి రెండున్నర లక్షల కేసులు.. జులై 31 నాటికి ఐదున్నర లక్షల కేసులు రికార్డయ్యే ప్రమాదం ఉందని సర్వేలు సైతం హెచ్చరించాయి. బాధితులకు ట్రీట్‌మెంట్‌ ఇచ్చేందుకు 80వేల బెడ్లు అవసరమని ప్రభుత్వం భావించింది. అయితే ఢిల్లీ సర్కార్ అంచనాలను అధిగమించింది.

జులై 15 నాటికి లక్షా 50వేల దగ్గరే వైరస్‌ వ్యాప్తిని ప్రభుత్వం అడ్డుకోగలిగింది. ఈ నెల 20న కేవలం 954 కేసులే నమోదయ్యాయి. గత ఐదు రోజులుగా కేవలం 15 వందల లోపు కేసులు మాత్రమే ఢిల్లీలో నమోదవుతున్నాయి. ఇదే సందర్భంలో మరణాలు రేటు గ‌ణ‌నీయంగా తగ్గింది.

వైరస్ బారి నుంచి కోలుకుంటున్న వారి శాతం దాదాపు 86గా ఉంది. దాదాపు లక్ష 27 వేల మందికి వైరస్ సోకగా.. లక్షా ఎనిమిది వేల మంది కోలుకున్నారు. ఒకప్పుడు ఢిల్లీలో రోజుకు ఐదు వేల టెస్ట్ లు కూడా చేయలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ సమస్యను కూడా ప్రభుత్వం అధిగమించింది.

కరోనాకు వైద్యం, ఆసుపత్రుల్లో పడకలపై ప్రజల్లో నెలకొన్న భయాన్ని దూరం చేసేలా యాప్లతో పారదర్శకతకు కేజ్రీవాల్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో ఆసుపత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్లు, ఇతర సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.

స్వల్ప లక్షణాలు, లక్షణాలు లేని కరోనా బాధితులను హోం ఐసోలేషన్‌లో ఉంచుతూ.. వైద్యాన్ని అందించింది. దీంతో ప్రతి రోజు సుమారు 20 వేల టెస్టులు నిర్వహించాలనే టార్గెట్‌ను రీచ్ అయ్యింది. ఇదే సందర్బంలో అదనంగా ఆసుపత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్లను సమకూర్చుకుంది. ప్రైవేటు ఆసుపత్రులను తమ కంట్రోల్‌లోకి తీసుకొని… వైద్యాన్ని అందిస్తోంది.

ప్రభుత్వం చర్యలను స్వాగతించిన ప్రజలు… స్వచ్చందంగా టెస్టులు చేయించుకునేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో ప్రతి రోజు పరీక్షల సామర్థ్యం 23 వేలు దాటడం సర్వత్రా ప్రశంసలకు కారణమవుతోంది.