ఎయిర్‌పోర్టుకు లేటుగా వచ్చిన డిప్యూటీ సీఎం.. విమానాన్ని నడపనని చెప్పిన పైలట్.. ఆ తర్వాత మరో ట్విస్ట్‌

జల్‌గావ్ విమానాశ్రయానికి షిండే ఆలస్యంగా రావడం శీతల్‌ పాటిల్‌ అనే మహిళకు వరంగా మారింది.

ఎయిర్‌పోర్టుకు లేటుగా వచ్చిన డిప్యూటీ సీఎం.. విమానాన్ని నడపనని చెప్పిన పైలట్.. ఆ తర్వాత మరో ట్విస్ట్‌

Updated On : June 7, 2025 / 5:02 PM IST

“నా డ్యూటీ టైమింగ్స్‌ అయిపోయాయి… ఇక నేను పని చేయను… ఇంటికి వెళ్లిపోతా” అని ఓ పైలట్‌ చెప్పడంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేకు జలగావ్‌ ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఏక్‌నాథ్‌ షిండే అక్కడే దాదాపు గంటసేపు వేచిచూడాల్సి వచ్చింది.

ఏక్‌నాథ్‌తో పాటు మంత్రులు గిరీశ్‌ మహాజన్‌, గులాబ్‌ రావ్‌ పాటిల్ జలగావ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడికి రావడమే చాలా ఆలస్యంగా వచ్చారు. ఆ తర్వాత తిరిగి ముంబై వెళ్లేందుకు జలగావ్‌ ఎయిర్‌పోర్టుకు మరింత ఆలస్యంగా ఇచ్చారు. షిండే ప్రయాణించాల్సిన చార్టర్డ్ విమానాన్ని నడిపే పైలట్‌ డ్యూటీ టైమ్ అప్పటికే ముగిసింది. దీంతో విమానం నడపబోమనని పైలట్ చెప్పాడు.

దీంతో మంత్రులు, జిల్లా పరిపాలన అధికారులు 45 నిమిషాల పాటు విమాన సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. చివరకు విమానాన్ని నడిపేందుకు పైలట్‌ ఒప్పుకున్నాడు. ఏదేమైనప్పటికీ, జల్‌గావ్ విమానాశ్రయానికి షిండే ఆలస్యంగా రావడం శీతల్‌ పాటిల్‌ అనే మహిళకు వరంగా మారింది.

అత్యవసరంగా కిడ్నీల చికిత్స కోసం ఆ మహిళ ముంబైకి చేరుకోవాల్సి ఉంది. అయితే, ఆమో ఎక్కాల్సిన విమానం అప్పటికే వెళ్లిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న షిండే ఆమెకు లిఫ్ట్‌ ఇచ్చారు. ఆమె కోసం ముంబై ఎయిర్‌పోర్టులో అంబులెన్స్‌ కూడా సిద్ధంగా ఉండేలా చేశారు.