Delhi Politics: ఢిల్లీ రాజకీయాలపై కొనసాగుతున్న ఉత్కంఠ.. కేజ్రీవాల్ నెక్స్ట్ ప్లాన్ అదేనా?
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయంతో ఢిల్లీ రాజకీయాల ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Arvind Kejriwal
Delhi Politics : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయంతో ఢిల్లీ రాజకీయాల ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. రేపు శాసనసభ పక్ష సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉంది. అయితే, కొత్త ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుందా.. లేకుంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా అనే అంశం ఆసక్తికరంగా మారింది. కేజ్రీవాల్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ముందస్తుగా ఈ నవంబర్ లోనే ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ కోరుతున్నారు. ముందస్తు ఎన్నికలకోసం ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. నవంబర్ నెలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలతో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ ఇప్పటికే డిమాండ్ చేశారు. దీంతో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారన్న వాదన ఆప్ వర్గాల నుంచి వినిపిస్తోంది.
Arvind Kejriwal : రెండు రోజుల్లో రాజీనామా చేస్తా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
ప్రభుత్వాన్ని రద్దుచేస్తే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోతే కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసి ప్రజల్లోకి వెళ్లాలన్న వ్యూహంలో కేజ్రీవాల్ ఉన్నారు. ఈ క్రమంలో రేపు ఆప్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేజ్రీవాల్ ఏం చేయబోతున్నారనే అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయాల్సి వస్తే రేసులో కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ముందు వరుసలో ఉన్నారని తెలుస్తోంది. ఆమెతో పాటు అతిశీ, కైలాష్ గెహ్లాట్, గోపాల్ రాయ్, సౌరబ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్ పేర్లు వినిపిస్తున్నాయి. సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన సందర్భంలో కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమను నిజాయితీపరులమని గుర్తిస్తేనే పదవుల్లో ఉంటామని స్పష్టం చేశారు. ఇదిలాఉంటే కేజ్రీవాల్ సంచలన నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కేజ్రీవాల్ యూటర్న్, సింపతి, డ్రామా రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు పేర్కొంటున్నారు.
Also Read : Manubhaker : నీరజ్ చోప్రా పోస్టుకు మనుబాకర్ రియాక్షన్.. పెళ్లెప్పుడంటూ ప్రశ్నిస్తున్న నెటిజన్ల
అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు. కేజ్రీవాల్ పై సుప్రీంకోర్టు ఇప్పటికే నిషేధం విధించినందున సీఎం పదవికి రాజీనామా చేయడం రాజకీయ జిమ్మిక్కు అని కాంగ్రెస్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ అన్నారు. అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లడం వల్లనే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కును కోల్పోయారని, ఆరు నెలల క్రితమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఉండాల్సింది అని ఆయన అభిప్రాయ పడ్డారు. ఆయన సతీమణిని ముఖ్యమంత్రిని చేయడానికే కేజ్రీవాల్ నాటకమాడుతున్నారని బీజేపీ పేర్కొంది. అవకాశవాదంలో ఆయన పీహెచ్ డీ చేశారని, మద్యం కేసులో ఆయన్ను కోర్టు విముక్తుడిని చేయలేదని, కేవలం బెయిల్ మాత్రమే ఇచ్చిందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల కారణంగానే కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేయాల్సి వస్తోందని బీజేపీ నేతలు అన్నారు.