ఢిల్లీలో 20వేల మార్క్ దాటిన కరోనా కేసులు

దేశరాజధానిలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులను చూస్తే మహారాష్ట్రతో పోటీ పడుతున్నట్లు కన్పిస్తోంది. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 20వేల మార్క్ దాటిపోయింది. గడిచిన 24గంటల్లో ఢిల్లీలో 990కొత్త కేసులు నమోదవడంతో ఢిల్లీలో ఇప్పటివరకు 20,834కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఢిల్లీలో 12మంది చనిపోగా…దేశరాజధానిలో ఇప్పటివరకు 532కరోనా మరణాలు నమోదయ్యాయి.
మరోవైపు ఢిల్లీలో స్పాలు మినహా బార్బర్ షాపులు, సెలూన్లతో సహా అన్నీ దుకాణాలు ఓపెన్ చేసుకోవచ్చని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ప్రకటించారు. ఢిల్లీ బోర్డర్లు ఓపెన్ చేయడంపై మాత్రం ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని, ఆ తర్వాతే ఫైనల్ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పెరుగుతున్న వైరస్ కేసులు తగ్గడానికి మరింత కృషి చేస్తున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు.
ఇక, దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1లక్షా 92వేలకు చేరువలో ఉండగా,మరణాల సంఖ్య 5వేల 500గా ఉంది. 93వేల మందికి పైగా ఇప్పటివరకు దేశంలో కరోనా బారిన పడి కోలుకున్నారు. దేశంలోని కరోనా కేసుల్లో 35శాతం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 70వేలు దాటింది. ఇవాళ ఒక్కరోజే మహారాష్ట్రలో 2,361కొత్త కేసులు,76మరణాలు నమోదయ్యాయి. దేశంలో నమోదైన కరోనా మరణాల్లో దాదాపు సగం మహారాష్ట్రలోనే ఉన్నాయి. మహారాష్ట్రలో 2,362 కరోనా మరణాలు ఇప్పటివరకు నమోదయ్యాయి. ఇక భారత్ లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం 48.18శాతంగా ఉంది. ఇక మొత్తం ప్రపంచంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 6.3 మిలియన్లను దాటింది.