Delhi Pollution : ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం తక్షణ చర్యలు : మంత్రి గోపాల్ రాయ్

దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకీ తీవ్రమవుతోంది. గాలి నాణ్యత కూడా అంతకంతకూ క్షీణిస్తోంది. వాయుకాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది.

Delhi Pollution : ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం తక్షణ చర్యలు : మంత్రి గోపాల్ రాయ్

Delhi Govt To Take Actions To Control Air Pollution

Updated On : November 13, 2021 / 10:06 PM IST

Delhi Pollution : దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకీ తీవ్రమవుతోంది. గాలి నాణ్యత కూడా అంతకంతకూ క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో వాయుకాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపడుతోంది. కాలుష్య నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. కాలుష్య వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహిస్తోందని అన్నారు. కాలిష్యానికి కారకాలుగా మారిన 2,500 ప్రాంతాలను తనిఖీ చేసినట్టు తెలిపారు. వాహన కాలుష్యం తగ్గించడం కోసం ‘రెడ్ లైట్ ఆన్, వెహికల్ ఆఫ్’ ప్రచారాన్ని కూడా ప్రారంభించినట్టు తెలిపారు.

బయోమాస్ బర్నింగ్‌ను నియంత్రించడానికి 550 మందిని నియమించినట్టు గోపాల్ రాయ్ వెల్లడించారు. పంట వ్యర్ధాలు కాల్చడం ఆపడానికి రైతులకు బయో డీకంపోజర్ ఇస్తున్నామన్నారు. మెట్రోలు, బస్సుల ఫ్రీక్వెన్సీని పెంచడానికి, ఢిల్లీ మెట్రో రవాణా శాఖకు దిశానిర్దేశం చేసినట్టు తెలిపారు. సరి-బేసి వాహన విధానం అమలు చేయడం అనేది చివరి చర్యగా ఆయన పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉందో తెలియదన్నారు. అత్యవసర ఉమ్మడి సమావేశం అవసరమని, ఇందుకోసం కేంద్రానికి మళ్లీ లేఖ పంపినట్టు మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.

మరోవైపు.. వాయుకాలుష్యంపై కేజ్రీవాల్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం నుంచి ఢిల్లీలో పాఠశాలలు, కార్యాలయాలను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని సూచనలు చేసింది. అలాగే ప్రభుత్వోద్యోగులకు ఇంటి వద్ద నుంచే పని చేసే అవకాశం కల్పించారు. వారం రోజుల పాటు విద్యార్థులకు ఫిజికల్ స్కూల్స్ మూసివేయనున్నారు. రేపటి (ఆదివారం) నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో నిర్మాణ పనులు నిలిపివేశారు. ప్రభుత్వ కార్యాలయాలు ఒక వారం పాటు 100 సామర్థ్యంతో వర్క్ ఫ్రమ్ హోం పనిచేయాలన్నారు.

ప్రైవేటు కార్యాలయాలు వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోంకు అనుమతి ఇవ్వాలని సూచించారు. వాయుకాలుష్య సమస్యను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక ప్రయత్నాలతో పాటు తక్షణం, అత్యవసరంగా స్పందించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు గట్టిగా సూచనలు చేసింది. కోర్టు ఆదేశాలతో సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో లాక్‌డౌన్ విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
Read Also : Delhi Pollution: ఢిల్లీలో తీవ్రవాయు కాలుష్యం.. కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు..!