JNU హింసలో కీలక విషయాలు : ఆ విద్యార్ధులే టార్గెట్‌గా దాడి

ఢిల్లీలోని జేఎన్‌యూ హాస్టళ్లపై ఆదివారం రాత్రి జరిగిన విధ్వంసకాండ పక్కా ప్లాన్ ప్రకారంగానే జరిగిందనటానికి నిదర్శనంగా కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడులు పెరియార్, సబర్మతి హాస్టళ్లనే టార్గెట్ గా చేసుకున్న దుండగులు దాడులకు పాల్పడ్డారు. సబర్మతి హాస్టల్‌లోనే ఎక్కువ గదులు ధ్వంసంకావటం దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తోంది. పెరియార్, సబర్మతి హాస్టళ్లు వామపక్ష, ముస్లిం విద్యార్థులవే కావటం ముఖ్యంగా గమనించాల్సిన విషయం.
అంబేద్కర్ పోస్టర్ ఉందని..బ్లైండ్ స్కాలర్ ని కూడా విడచిపెట్టని దుండగులు
సబర్మతి హాస్టల్‌లోనే జేఎన్‌యూ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నాయకురాలు ఘోష్‌పై దాడి జరిగింది. కళ్లు కనిపించని ఓ సంస్కత స్కాలర్ రూమ్ పై కూడా దుండగులు దాడికి పాల్పడ్డారు. ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటేమిటంటే ఆ కళ్లు కనిపించఃని స్టూడెంట్ రూమ్ డోర్ పై బీఆర్ అంబేడ్కర్ పోస్టర్ ఉండడాన్ని గమనించిన దుండగులు కావాలని ఆ రూమ్ పై దాడికి దిగినట్లుగా ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
ముస్లింలు..వామపక్షాలకు చెందిన విద్యార్ధులే టార్గెట్
అంతేకాదు దాడి చేయటానికి వచ్చిన ముసుగు దొంగలు కేవలం ముస్లింలకు..వామపక్షాలకు చెందిన విద్యార్ధులనే టార్గెట్ చేశారని కొట్టొచ్చినట్లుగా తెలుస్తోంది. ఎలాగంటే.. ఏబీవీపీకి సంబంధించిన పోస్టర్లు, గుర్తులు ఉన్న ఏ హాస్టల్ రూములవైపుగా దుండగులు దాడి చేయక పోవడం గమనించాల్సిన విషయం. ఇదంతా పోలీసులకు..వర్శిటీ యాజమాన్యానికి తెలీకుండా ఈ దాడి జరగలేదు అనటానికి మరో నిదర్శనం ఏమిటంటే..దుండగులు హాస్టల్స్ పై విధ్వంసం చేస్తున్న సమయంలో కొంతమంది విద్యార్థులు పోలీసులకు ఫోన్ చేసినా పోలీసులు ఏమాత్రం స్పందించలేదని ఫోన్ చేసిన విద్యార్ధులు చెబుతున్నారు.
పక్కా ప్లాన్ : హాస్టల్స్ వద్ద ఉండాల్సిన సెక్యూరిటీ గార్డ్స్ లేకుండా చేసారు
అంతేకాదు..ఆదివారం హాస్టల్స్ వద్ద మధ్యాహ్నాం మూడు నుంచి రాత్రి పదకొండు గంటలవరకు డ్యూటీలో షిప్టులో ఉండాల్సిన ఒక్క గార్డు కూడా లేకపోవడం ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందనటానికి ఇదోక నిదర్శనం. కాగా..దాడులు జరిగిన హాస్టల్స్ వద్ద డ్యూటీలో ఉండాల్సిన గార్డులను మీడియా ఇదే విషయంపై ప్రశ్నించినా వారు సమాధానం చెప్పటానికి నిరాకరించారు. ఇలా విశ్లేషించుకుంటూ పోతే ఆదివారం రాత్రి కొంతమంది విద్యార్ధుల్ని మాత్రమే టార్గెట్ గా చేసుకుని దాడికి పక్కాగా ప్లాన్ జరిగింది అని తెలుస్తోంది.