భారత ఆర్మీ దగ్గర రహస్య ఆయుధాల గురించి మీకు తెలుసా?

రాజ్‌నాథ్ సింగ్ లద్ధాక్ పర్యటన విశేషాలు మీడియాలో వచ్చాయి . మీడియాలో కనిపించిన దృశ్యాలు సామాన్యులకు పెద్దగా అర్ధం కావు . కానీ , కొన్ని ఫోటోలు నిపుణులు పసిగట్టారు . అందులో కనిపించిన స్పెషల్ ఫోర్సెస్ ఆయుధాలు ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియదు. సాయుధ దళాలు వీటిని ఎప్పుడు సమకూర్చుకున్నాయో కూడా తెలియదు. అత్యాధునికమైన, ఖరీదైన ఈ ఆయుధాలను రాజ్‌నాథ్ సింగ్ పర్యటన ఫోటోలు పట్టిచ్చాయి.
రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ లద్ధాక్ పర్యటన భారత సైనిక దళాల యుద్ధ సంసిద్ధతను ప్రపంచానికి చాటి చెప్పింది. ముఖ్యంగా త్రివిధ దళాల స్పెషల్ ఫోర్సెస్ శక్తి సామర్ధ్యాలు రాజనాథ్ పర్యటనలో బయట పడ్డాయి. ఆయన పర్యటన ఫోటోలు కొన్ని రహస్య ఆయుధాలను బయట పెట్టింది. ఫోటోలలో రెండు వెపన్స్ మాత్రమే కనిపించాయి. స్పెషల్ ఫోర్సెస్ మరికొన్ని ఆయుధాలు రహస్యంగా సమకూర్చుకున్నాయని సైనిక నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా సాయుధ దళాల ఆయుధ సంపత్తి చాలా వరకు అందరికీ తెలుసు . కానీ , కొన్ని ఆయుధాలు మాత్రం రహస్యంగా సమకూర్చుకుంటారు.
లద్ధాక్ వద్ద సరిహద్దులను కాపలా కాస్తున్న త్రివిధ దళాల స్పెషల్ ఫోర్సెస్ శిబిరాలను రాజ్ నాథ్ సింగ్ సందర్శించారు. ఆ సమయంలో స్పెషల్ ఫోర్సెస్ సమకూర్చుకున్న అత్యాధునిక ఆయుధాలు పరిశీలించారు. రాజనాథ్ సింగ్ పర్యటనకు సంబంధించిన ఫోటోలతో అసలు విషయం బయటపడింది. త్రివిధ దళాల స్పెషల్ ఫోర్సెస్ కొన్ని అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకున్న విషయం నిపుణులు పసిగట్టారు.
త్రివిధ దళాలకు మూడు స్పెషల్ ఫోర్సెస్ ఉన్నాయి. ఆర్మీకి పారా ఎస్ ఎఫ్ , ఎయిర్ ఫోర్స్ కు గరుడ , నేవీకి మార్కోస్ స్పెషల్ ఫోర్సెస్ గా ఉన్నాయి . వీళ్ళు ప్రత్యేక కమాండో దళాలుగా పని చేస్తారు . స్పెషల్ ఆపరేషన్స్‌లో పాల్గొంటారు. చైనా దుందుడుకు చర్యల కారణంగా ప్రస్తుతం త్రివిధ దళాల స్పెషల్ ఫోర్సెస్‌ను లద్ధాక్‌కు తరలించారు . రాజనాథ్ సింగ్ లద్ధాక్ పర్యటనలో బయటపడ్డ స్పెషల్ ఫోర్సెస్ రహస్య ఆయుధాలు ఎలాంటివి ?
ఒకటి ఫిన్లాండ్ లో తయారైన స్నిపర్ రైఫిల్. ఇది పాయింట్ త్రి త్రి జీరో ఎస్ ఏ కె ఓ రకం రైఫిల్. ఇది ప్రపంచంలోనే నంబర్ వన్ రైఫిల్ . ఇది మాన్యువల్‌గా ఆపరేట్ చేసే బోల్ట్ యాక్షన్ వెపన్. 15 వందల మీటర్ల దూరం వరకు శత్రువులను చీల్చి చెండాడుతుంది. ఇలాంటివి 50 వరకు స్పెషల్ ఫోర్సెస్ గత ఏడాది సమకూర్చుకున్నాయని మిలిటరీ వర్గాల ద్వారా తెలిసింది.
రెండోది, అమెరికాలో తయారైన ప్రత్యేక హెల్మెట్. ఇది ఎక్సఫీల్ హై కట్ బాలిస్టిక్ హెల్మెట్ . పది మీటర్ల దూరం నించి వచ్చిన ఏ కె – 47 తూటాలను కూడా తట్టుకోవడం దీని ప్రత్యేకత . ప్రస్తుతం ఇవి పరిమిత సంఖ్యలోనే స్పెషల్ ఫోర్సెస్ సమకూర్చుకున్నాయి . ఇలాంటివి ఒక లక్ష హెల్మెట్లు కొనుగోలు కోసం గత నెలలో ఆర్డర్లు ఇచ్చారు . ప్రపంచంలోనే ఇది అతి పెద్ద ఆర్డర్ .
ఇవేకాక మరో రెండు రకాల స్నిపర్ రైఫిళ్లు గతేడాది స్పెషల్ ఫోర్సెస్ సమకూర్చుకున్నాయి. ఒకటి ఇటలీలో తయారైన బెరెట్టా పాయింట్ డబల్ త్రి ఎయిట్ లపువా మాగ్నమ్ స్కార్పియో టి జి టి స్నిపర్ రైఫిల్ . రెండోది అమెరికాలో తయారైన పాయింట్ ఫిఫ్టీ క్యాలిబర్ ఎం 95 స్నిపర్ రైఫిల్ . సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సాధారణ సైనిక జవాన్లకు కూడా వీటిని సమకూర్చారు .
లద్ధాక్‌లో భారత సాయుధ దళాల యుద్ధ సన్నద్ధత కూడా రక్షణ మంత్రి స్వయంగా పరిశీలించారు. పారా కమాండోలు, అపాచీ ఎటాక్ చాపర్స్ , హెర్క్యూలేస్ స్పెషల్ ఆపరేషన్స్ ఎయిర్ క్రాఫ్ట్ , టి – 90 ట్యాంకుల పని తీరు అడిగి తెలుసుకున్నారు. పదిహేడు వేల అడుగుల ఎత్తు నుంచి స్పెషల్ కమాండోలను కిందికి వదిలే పాత్ ఫైండర్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా రాజనాథ్ పరిశీలించారు . ముందుగా కమాండోలు వ్యూహాత్మక ప్రదేశాలలో నేలపైకి దిగి రెక్కీ నిర్వహిస్తారు. ఆ తరువాత సైనిక జవాన్లు సురక్షితంగా దిగుతారని దీన్ని ఉపయోగిస్తారు.